రాష్ట్రంలోని నిరుద్యోగులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న జంబో ఉద్యోగ ప్రకటన కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు ఖాళీల భర్తీకి గత రెండేళ్లుగా కొనసాగుతున్న కసరత్తు కొలిక్కి రాలేదు. కొత్త మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టుల వర్గీకరణ ఇటీవల పూర్తయినా, ఆ మేరకు ఉద్యోగుల సర్దుబాటుపై ఇంకా నిర్ణయం జరగకపోవడంతో అడుగులు ముందుకు పడటం లేదు. టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్యోగాల కోసం రిజస్టరైన దాదాపు 25 లక్షల మంది ఉద్యోగార్థులు ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశతో సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి దాటిపోతోంది. రాష్ట్రంలో రెండేళ్లలో వ్యవసాయ, పశువైద్య వర్సిటీల్లో సహాయకుల పోస్టులు మినహా కొత్త కొలువుల ప్రకటనలు రాలేదు. పోలీసు విభాగంలో 19 వేల ఉద్యోగాలను గుర్తించినా ప్రకటనలు వెలువడలేదు. 2018లోనే దాదాపు 150 పోస్టులతో తొలి తెలంగాణ గ్రూప్-1 ప్రకటనకు ఏర్పాట్లు పూర్తయినా కొత్తజోన్లు, మల్టీజోన్ల పేరిట నిలిచిపోయింది. గతంలోనే గుర్తించిన గ్రూప్-2, గ్రూప్-3 ఇతరత్రా 1949 పోస్టుల ప్రతిపాదనలు సవరించాలని 2018లో టీఎస్‌పీఎస్సీ వెనక్కి పంపించగా.. రెండున్నరేళ్లుగా పురోగతి లేకపోయింది.
అనుమతించిన పోస్టులున్నా...
రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల కారణంగా అప్పటికే అనుమతించిన దాదాపు 12 వేల పోస్టుల ప్రకటనలు నిలిచిపోయాయి. గురుకుల నియామకబోర్డు పరిధిలో రాష్ట్రపతి నూతన ఉత్తర్వులపై సాంకేతిక అడ్డంకుల కారణంగా దాదాపు 8 వేలకు పైగా పోస్టులు భర్తీ కాలేదు. మూడేళ్ల కిందట బీసీ సంక్షేమశాఖ పరిధిలో ఏర్పాటు చేసిన 250కి పైగా గురుకుల పాఠశాలలు ఇప్పుడు కళాశాల స్థాయికి చేరాయి. మైనార్టీ గురుకులాలు కళాశాలలయ్యాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య పెరిగినా శాశ్వత ఉపాధ్యాయుల నియామకాలు జరగలేదు. టీఎస్‌పీఎస్సీ పరిధిలో నిలిచిన గ్రూప్-1, గ్రూప్-3 ప్రకటనలకు అత్యంత ప్రాధాన్యం కింద వెంటనే వెలువరించాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకున్నా.. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాలేదు.
కచ్చితమైన గడువు ఉండాలి
ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలని చెబుతోంది. కానీ రెండేళ్లయినా ప్రకటన రాలేదు. 2016లో గ్రూప్-2లో 1:3లో ఎంపికైనా పోస్టు దక్కలేదు. అప్పటినుంచి మరో గ్రూప్-1, 2 కోసం చూస్తున్నా. వరంగల్ నుంచి వచ్చి ఇక్కడే ఉండి ప్రిపేరవుతున్నా. స్పష్టమైన గడువు చెబితే నిరుద్యోగులు సన్నద్ధమయ్యేందుకు వీలుంటుంది. ఇప్పటికే రెండేళ్ల కిందట కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.