జాతీయ పార్టీపై జరుగుతున్న ప్రచారంపై తెరాస శాసనసభ పక్షంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస శాసనసభ పక్ష సమావేశం జరిగింది. నయా భారత్.. గియా భారత్ ఏదీ లేదని.. అలాంటి ప్రచారం నమ్మొద్దని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ తెలిపారు. దేశంలో రాజకీయ శూన్యత ఉన్నప్పటికీ.. ఇప్పుడే జాతీయ రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సమయం వచ్చినప్పుడు అందరితో చర్చించిన తర్వాతే.. ముందుకెళ్తానని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం జాతీయపార్టీ పెట్టే ఆలోచన లేదు: కేసీఆర్ - కేసీఆర్ వార్తలు
19:23 September 07
ప్రస్తుతం జాతీయపార్టీ పెట్టే ఆలోచన లేదు: కేసీఆర్
దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన రెవెన్యూ చట్టం రాబోతున్నదని ముఖ్యమంత్రి వివరించారు. బుధవారం సభలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలిపారు. కొత్త చట్టంతో తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ఇది అమల్లోకి వస్తే... భూములపై దౌర్జన్యాలు ఉండబోవన్నారు. కొత్త చట్టాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకూల పవనాలు
జీహెచ్ఎంసీలో తెరాస అనుకూల పవనాలు ఉన్నట్లు పలు సర్వేల్లో తేలిందని సీఎం కేసీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస 94 నుంచి 104 స్థానాలు సాధిస్తుందని సర్వేల్లో వచ్చాయని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పోటీనిచ్చే స్థితిలో లేదని.. భాజపాకు ఇప్పుడున్న సీట్ల కన్నా ఒకటో, రెండో ఎక్కువగా రావచ్చునని కేసీఆర్ పేర్కొన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో లక్ష మెజారిటీతో తెరాస గెలుస్తుందని తెరాస అధినేత ధీమా వ్యక్తం చేశారు.
సోలిపేటకు సంతాపం
సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, భాజపాలు నినాదాలు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. అసెంబ్లీ, మండలి సమావేశాల్లో సభ్యులు హుందాగా ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి తెరాస శాసనసభ పక్షం సంతాపం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!