హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం తెరాసదేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వే ప్రకారం తెరాసకు 13 శాతానికి పైగా ఓట్లు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలకు వివరించారు. ప్లీనరీ ముగిసిన తర్వాత ఈనెల 26 లేదా 27న ఎన్నికల ప్రచార సభకు తాను హాజరుకానున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
విపక్షాల దిమ్మ తిరిగి పోయేలా..
ద్విదశాబ్ది ఉత్సవాల సన్నాహకాల్లో భాగంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ, శాసనసభ పక్షం సమావేశం జరిగింది. ఈనెల 25న ప్లీనరీలో 6,500 మందికి మాత్రమే ఆహ్వానం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. విపక్షాల దిమ్మ తిరిగి పోయేలా.. ఆరోపణలన్నింటికీ సమాధానం ఇచ్చేలా.. సుమారు పది లక్షల మందితో సభ నిర్వహించుకోవాలన్నారు. ప్రతీ గ్రామానికి ఒక బస్సు ద్వారా... సుమారు 20వేల బస్సుల్లో కార్యకర్తలను సభకు తీసుకురావాలన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సభ నిర్వహణ బాధ్యత చూస్తారని చెప్పారు. విజయ గర్జన సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లపై రేపటి నుంచి తెలంగాణ భవన్లో రోజుకు 20 నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలతో కేటీఆర్, కె.కేశవరావు సమావేశాలు నిర్వహిస్తారన్నారు.
అప్పటి పరిస్థితి వేరు..
మళ్లీ ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు తెలిపారు. గతంలో ఎలాంటి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందో వివరించారు. ప్రభుత్వానికి రెండున్నరేళ్ల సమయం ఉందని.. ఆ సమయంలో చేయాల్సింది ఇంకా చాలా ఉందని కేసీఆర్ తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచేలా పనిచేయాలని దిశనిర్దేశం చేశారు. కేంద్రంలోనూ తెరాస నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెరాస రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కేసీఆర్ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత రాష్ట్ర కార్యవర్గ నేతలు ఆరు నామినేషన్లు దాఖలు చేశారు.
2018లో తెరాస అఖండ విజయం..
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ అఖండి విజయం సాధించారు. ప్రత్యర్థులను చిత్తు చేశారు. తెరాస ఒంటరిగా పోటీచేయగా.. కాంగ్రెస్, తెలుగుదేశం, తెజస కలిసి మహాకూటమిగా బరిలో దిగాయి. తెరాస ఏకంగా 88 స్థానాల్లో విజయం సాధించింది. 99 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ కేవలం 19 చోట్ల మాత్రమే గెలుపొందింది. 8 చోట్ల బరిలో నిలిచిన ఎంఐఎం పార్టీ 7 చోట్ల విజయం సాధించింది. 13 చోట్ల పోటీచేసిన తెలుగు దేశం మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమవ్వగా.. భాజపా ఒక్క చోట విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఫలితాల అనంతరం ఇండిపెండెంట్‌గా గెలిచిన ఎమ్మెల్యే గులాబీ గూటికి చేాశారు. అనంతరం గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీయడంతో.. కాంగ్రెస్ నుంచి సుమారు 13 మంది, తెదేపా నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కేశారు.
ఇదీచూడండి:CM KCR: ఈనెల 25 తర్వాత హుజూరాబాద్‌లో కేసీఆర్ సభ