School management funds : రాష్ట్రంలో పాఠశాలలను, కళాశాలలను తెరిచిన విద్యాశాఖ వాటి నిర్వహణకు అవసరమైన నిధులను ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. సమగ్ర శిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇస్తేనే తాము కొంత వాటాను కలిపి బడులకు విడుదల చేస్తామని ఆ శాఖవర్గాలు చెబుతున్నాయి. కేంద్ర నిధుల కోసమే ఎదురుచూస్తున్నామని పేర్కొంటున్నాయి. ఫలితంగా విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన స్టేషనరీ కొనుగోలు సమస్యగా మారింది. వేల కోట్ల రూపాయలతో బడులను అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వాటి నిర్వహణకు అవసరమైన కొద్దిపాటి నిధులను మాత్రం సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.
బడులు తెరిచి 10 రోజులైనా..తరగతుల వారీగా హాజరుపట్టీలు(రిజిస్టర్లు), సుద్దముక్కలు(చాక్‌పీసులు), డస్టర్లు, చీపుర్లు, శౌచాలయాలను శుభ్రం చేసేందుకు ఫినాయిల్, కొత్తగా ప్రవేశాలు తీసుకునేందుకు ముద్రించిన ఫారాలు తదితర పలు వస్తువులతోపాటు పాఠశాలల్లో చిన్నచిన్న మరమ్మతులు తప్పనిసరి. అందుకోసమే బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒక్కో పాఠశాలకు విద్యా సంవత్సరానికి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు పాఠశాల విద్యాశాఖ అందించాలి.
no funds for School management : కరోనా పరిస్థితులతో సబ్బులు, హ్యాండ్‌వాష్, శానిటైజర్లను కూడా కొనుగోలు చేయాల్సి వస్తోంది. వాస్తవానికి బడుల ప్రారంభ సమయంలోనే అధికంగా ఈ నిధులు అవసరం. ఈ విద్యా సంవత్సరం విద్యాలయాలు తెరిచి 10 రోజులవుతున్నా ఇప్పటివరకు స్కూల్ గ్రాంట్ ఊసేలేదు. కనీస అవసరాలు తీర్చాలన్న ఉద్దేశంలో సొంత జేబుల నుంచి ఖర్చు చేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు కొందరు తెలిపారు. తాను రూ.3,500లతో ఆయా వస్తువులు కొనుగోలు చేసినట్లు కరీంనగర్ జిల్లాకు చెందిన హెచ్‌ఎం ఒకరు చెప్పారు.