కీలకమైన కొత్త రైల్వే ప్రాజెక్టులు అవి. వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రయాణికులు, సరకు రవాణాకు వీలు కల్పించేవి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వేగంగా పూర్తవుతాయనుకుంటే.. ఏళ్లతరబడి సాగుతూనే ఉన్నాయి. ఇదేమిటంటే రాష్ట్ర వాటా కింద నిధులు ఇవ్వడం లేదని, వాటిని జమ చేస్తేనే పనులు జరుగుతాయని రైల్వేశాఖ చెబుతోంది. ఏపీ ప్రభుత్వం మొక్కుబడిగా నిధులివ్వడంతో.. రైల్వే శాఖ కూడా ఏటా బడ్జెట్‌లో తన వాటా కింద పరిమితంగానే నిధులు కేటాయించి అంతంతమాత్రంగా పనులు చేస్తోంది. ఈ కోవలోకి వచ్చేవే... నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, కోటిపల్లి-నర్సాపురం కొత్త రైల్వే మార్గాలు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.1,871 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఆ నిధులు ఇవ్వకపోవడంతో ఆయా ప్రాజెక్టుల పనులు జాప్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
2024-25 నాటికి పూర్తి
నడికుడి-శ్రీకాళహస్తి మధ్య 308.70 కి.మీ. కొత్త లైను ప్రాజెక్టు 2011-12లో మంజూరైంది. దీనికి అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో పాటు, వ్యయంలో 50 శాతం భరించాల్సి ఉంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో లభ్యమయ్యే ఖనిజ రవాణా, ఇతర పారిశ్రామిక అభివృద్ధికి, ప్రయాణికుల రవాణాకు ఈ మార్గం దోహదపడుతుంది. విజయవాడ-చెన్నై మధ్య ఉన్న మార్గానికి ప్రత్యామ్నాయంగా దీనిని చేపట్టారు. మొదట్లో రూ.2,289 కోట్ల అంచనాతో మొదలుపెట్టగా ప్రస్తుతం అది రూ.2,650 వేల కోట్లకు చేరింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.6 కోట్లే ఇచ్చింది. మరో రూ.1,262 కోట్లు జమ చేయాల్సి ఉంది. రైల్వేశాఖ న్యూపిడుగురాళ్ల నుంచి శావల్యాపురం వరకు 45.85 కి.మీ. మార్గం పూర్తి చేసింది. ఇంకా నాలుగు దశల్లో పనులు పూర్తి కావాలి. భూసేకరణ వేగంగా జరపడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లిస్తే 2024-25 నాటికి ఇది పూర్తయ్యే వీలుందని అంచనా.