Double bedroom houses: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల పూర్తికి నిధుల సమస్య ఎదురవుతోంది. 1,16,562 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఓవైపు బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించిన నిధుల కోసం, మరోవైపు రుణం కోసం హౌసింగ్ కార్పొరేషన్ ముమ్మర యత్నాలు చేస్తోంది. తొలి త్రైమాసికం కింద రూ.1,100 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరగా.. రూ.203 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు ఆర్థికశాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నిధులు కార్పొరేషన్ ఖాతాకు ఇంకా చేరాల్సి ఉంది. మరోవైపు రూ.2 వేల కోట్ల రుణం కోసం అధికారులు దిల్లీలోని ‘హడ్కో’ ప్రధాన, హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్‌బీఐ అనుమతి కోసం హడ్కో గత నెలలోనే లేఖ రాసింది. మే 23కల్లా స్పష్టత వస్తుందని చెప్పినా రిజర్వు బ్యాంకు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో రూ.2 వేల కోట్ల రుణంపై సందిగ్ధత నెలకొంది.
రాష్ట్రంలో పేదల కోసం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. తొలుత స్థలాలు, గుత్తేదారులు ముందుకురాక పనులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత నిధులు సరిపడా లేక జాప్యమవుతోంది. నిర్మాణంలో ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు, సొంత జాగా ఉన్నవారికి రూ.3 లక్షల పథకం కోసం 2021-22 బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు ప్రతిపాదించింది. స్థలం ఉన్నవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం ఇస్తామంటూ ప్రకటించిన పథకం అమల్లోకి రాలేదు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకైనా సరిపడా నిధులివ్వలేదు. గత ఆర్థిక సంవత్సరం అంతా కలిపి రూ.600 కోట్ల నిధుల్నే ప్రభుత్వం ఇచ్చింది. దీంతో రూ.1,200 కోట్ల రుణాన్ని హౌసింగ్ కార్పొరేషన్ తీసుకుంది.
కనీసం మరో రూ.4 వేల కోట్లు అవసరం!
ప్రభుత్వం మంజూరు చేసిన 2,91,057 రెండు పడక గదుల ఇళ్ల అంచనా వ్యయం రూ.19,125.90 కోట్లు. ఏప్రిల్ నెలాఖరు వరకు రూ.10,800.10 కోట్లు ఖర్చు చేశారు. ఈ లెక్కన ఇంకా రూ.8,325.80 కోట్లు కావాలి. అయితే 2,29,575 ఇళ్లకే టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టారు. వీటిలో 1,13,013 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. 68,964 ఇళ్ల పనులు చివరి దశలో, 47,598 ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. పనులు మొదలుకానివి మినహాయిస్తే- నిర్మాణంలో ఉన్నవాటికి కనీసం రూ.4 వేల కోట్లు కావాలన్నది అధికారుల అంచనా. వీటిని పూర్తి చేయడంపై హౌసింగ్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. బాగా ఆలస్యమవుతుండటంతో అసంపూర్తి నిర్మాణాల వల్ల నిర్వహణ సమస్యలతో పాటు నిర్మాణ వ్యయమూ పెరిగిపోతోంది.