ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభను అడ్డుకోవాలని కొందరు రాళ్ల దాడి చేసినట్లు వస్తున్న వార్తల్లో తమకు ఆధారాలు లభించలేదని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పోలీసులపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు. ఎన్నికలను సజావుగా నడిపించటానికి పోలీసులు శ్రమిస్తున్నవారిని నిందించటం సబబు కాదని అన్నారు.
ఏపీలో రాళ్లదాడి ఘటనపై ఎలాంటి ఆధారాలు లభించలేదు: డీఐజీ - చంద్రబాబుపై రాళ్లదాడి వార్తలు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి బహిరంగ సభను అడ్డుకోవాలని రాళ్ల దాడి చేసినట్లు తమకు ఆధారాలు లభించలేదని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించినా.. తమకు ఎలాంటి సమాచారం దొరకలేదని తెలిపారు. ఫిర్యాదు చేసిన తెదేపా నాయకులను ఆధారాలను సమర్పించాలని కోరామని.. ఈ విషయమై చంద్రబాబుకు నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు.
"రాళ్ల దాడిపై సమాచారం ఇవ్వాలని చంద్రబాబుకు నోటీసు ఇచ్చాం. ఆధారాలు ఇవ్వాలని కోరాం. దాడిపై ఆధారాలు ఇవ్వాలని ఫిర్యాదు చేసిన తెదేపా నేతలనూ కోరాం. ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి మా విచారణలో కనిపించలేదు. రాళ్లు తగిలాయని ఇద్దరు కార్యకర్తలు చెప్పారు. చంద్రబాబు సభలో రాళ్ల దాడి ఘటనపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశాం. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించాం, ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నించాం. దాడి ఘటనపై మాత్రం ఎలాంటి ఆధారాలు లభించలేదు. చంద్రబాబు భద్రతా సిబ్బంది, ఎన్‌ఎస్‌జీ కమాండోలను ప్రశ్నించాం. చంద్రబాబు వాహన శ్రేణిని పరిశీలించాం. సభను అడ్డుకోవాలని దాడి చేసినట్లు ఆధారాలు లభించలేదు."- డీఐజీ కాంతి రాణా
ఇదీచదవండి:తెరాసపై ఎన్నికల కమిషనర్‌కు ఉత్తమ్ కుమార్ ఫిర్యాదు