ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి వైద్యారోగ్య జారీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నా...పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో రైతుబజార్లు, హోల్‌సేల్ మార్కెట్లలో కొవిడ్ జాగ్రత్తలు గాలికొదిలేస్తున్నారు. వినియోగదారులు కొంతవరకూ మాస్కులుధరిస్తున్నా.. దుకాణదారులు అస్సలు పట్టించుకోవడంలేదు. గతంలో మాదిరిగా శానిటైజర్ల వినియోగం, థర్మల్ స్క్రీనింగ్ చేయడం ఎక్కడా కనిపించడంలేదు. హైదరాబాద్‌లో 11 రైతు బజార్లుండగా వాటిలో కూరగాయలు అమ్మే దుకాణదారులే మాస్కులు సరిగా పెట్టుకోవట్లేదు. ఫలక్‌నుమా, మెహిదీపట్నం, కొత్తపేట, ఎర్రగడ్డ రైతుబజార్లకు నిత్యం పెద్దసంఖ్యలో వినియోగదారులు వస్తారు. అయినా మాస్కులు ధరించటంలో...... జనం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. భౌతికదూరం పాటించకపోగా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారు.
మహబూబ్‌నగర్‌లోని మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతుబజార్, మాంసం, చేపల దుకాణాలకు జనం పోటెత్తుతున్నారు. కరోనా కోరలు చాస్తున్నా...... జనం ఎక్కడా కొవిడ్ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తున్నారు. జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాలకు తప్పనిసరై వెళ్తున్నప్పుడు....మాస్క్ ధరించడం సహా వీలైనంత వరకూ భౌతిక దూరం పాటించాల్సి ఉన్నా పట్టించుకున్న వారే లేరు. జాగ్రత్తలు పాటించని వినియోగదారులకు సేవలను అందించకుండా ఉండాల్సిన దుకాణయజమానులే మాస్కులు ధరించట్లేదు. కొన్ని దుకాణాల్లో కనీసం శానిటైజర్ అందుబాటులో లేదు. పక్కపక్కనే దుకాణాలు ఉండటంతో వినియోగదారులు భౌతికదూరాన్ని పాటించలేని దుస్థితి.