ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్‌లైన్ తరగతులపై స్పష్టత లేకపోవటంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ప్రవేశాల సంఖ్యను పెంచుకునేందుకు కాంట్రాక్టు అధ్యాపకులను గ్రామాల్లో పర్యటింపచేస్తున్న ఇంటర్ విద్యాశాఖ.. ప్రథమ సంవత్సరం తరగతుల ప్రారంభాన్ని మరిచిపోయింది. జులై ఒకటో తేదీ నుంచి రెండో ఏడాది విద్యార్థులకు ఆన్‌లైన్, టీవీ పాఠాలను మొదలుపెట్టిన ఆ శాఖ అధికారులు.. తొలి ఏడాదికి మాత్రం ఇప్పటివరకు ప్రారంభించకపోవడం గమనార్హం. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువు శనివారంతో ముగియగా దాన్ని ఆగస్టు 17 వరకు పెంచుతూ ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 402 ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటివరకు దాదాపు 93 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
ప్రవేశాల గడిగించిన ఇంటర్ బోర్డు
తాజాగా ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించిందే తప్ప టీవీ పాఠాలెప్పుడో వెల్లడించకపోవడం గమనార్హం. మే 25 నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. అంటే రెండు నెలలు దాటింది. ఇంకెప్పుడు పాఠాలు మొదలవుతాయా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ కళాశాలల్లో 30 శాతం, కార్పొరేట్ కళాశాలల్లో ఇప్పటివరకు 50 శాతం సిలబస్ పూర్తయిందని హైదరాబాద్‌లోని కళాశాలల నిర్వాహకుడు ఒకరు తెలిపారు. ఆన్‌లైన్ పాఠాల ద్వారా కొంతవరకైనా అర్థమైతే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాక మళ్లీ పాఠాలు బోధిస్తే సులభంగా గ్రహించగలుగుతారని నిపుణులు అంటున్నారు.