ఏపీ బడ్జెట్‌లో పెండింగ్ బిల్లుల ఊసేలేదు Budget For Pending bills in AP : రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి.. రూ.2 లక్షల 56 వేల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కరోనాతో పోలిస్తే ఆదాయాలు గణనీయంగా పెరిగాయని.. పన్నుల ఆదాయమూ పెరిగిందని ప్రకటించుకుంది. కానీ.. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు మాత్రం పెండింగ్ లోనే ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
లక్ష కోట్ల రూపాయల మేర బిల్లులు
AP Budget Sessions 2022 : కరోనా రోగులకు భోజనం సరఫరా చేసినవారి దగ్గరి నుంచి.. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల వరకూ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఈ బిల్లుల చెల్లింపుల గురించి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రస్తావించనే లేదు. పీడీ ఖాతాలకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించే అంశాన్నీ ప్రస్తావించలేదు. అప్పులు తెచ్చి ప్రభుత్వానికి చిన్న చిన్న పనులు చేసిన గుత్తేదారులకు.. బిల్లులు చెల్లించేదెప్పుడన్నది ప్రతిపాదించలేదు. బడ్జెట్ కు నెల ముందే ఖజానా నుంచి చెల్లింపులు నిలిపివేశారు. ప్రభుత్వం వినియోగించే వాహనాలు.. కార్యాలయాల అద్దె బిల్లులనూ ఆపేశారు.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
No Budget For Pending Bills of AP : వాస్తవానికి కొన్నిటికి చెల్లింపు ఉత్తర్వులు ఇచ్చినా.. వాటిని పట్టించుకోకపోవటంతో సదరు బిల్లులు నిరర్ధకంగా మారిన దాఖలాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వాటిని కొత్త బడ్జెట్ కు కూడా బదలాయించకపోవటంతో వాటి పరిస్థితి ఏంటన్నది.. అగమ్య గోచరంగా మారింది. చెల్లించాల్సిన బిల్లులతోపాటు బడ్జెట్ లో లేని కేటాయింపుల ఖర్చు.. రూ.90 వేల కోట్లు ఉన్నట్టు కాగ్ స్పష్టం చేసింది. అలాగే కేటాయింపులు చూపి ఖర్చు చేయని మొత్తం కూడా 30 వేల కోట్లు ఉన్నట్టు తేల్చి చెప్పింది. పేరుకుపోతున్న బిల్లుల బకాయిలతో.. చాలా మంది కాంట్రాక్టర్లు ఏ పనులూ చేసేందుకు ముందుకు రావడంలేదు. పాఠశాలల్లో నాడు- నేడు పథకం మొదటి దశ పనులకు చెల్లింపులు చేయకపోవటంతో.. రెండో దశ పనులకు గుత్తేదారులు వెనుకంజ వేస్తున్నారు. చేసేదేమీలేక ప్రభుత్వమే రెండో దశ పనుల్లో కోత పెట్టింది. రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులకూ.. కాంట్రాక్టర్లు ముందుకురావటం లేదు.