ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. తొలి దశలో ఎన్నికలు జరిగే పంచాయతీలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ఉదయం నుంచి మొదలవ్వాలి. నామినేషన్ల స్వీకరణకు ఏ జిల్లాలోనూ సన్నాహాలు జరగలేదు. జిల్లాల అధికార యంత్రాంగంలోనూ ఎలాంటి కదలికా లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఏపీ హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. దీనిపై కోర్టు నుంచి స్పష్టత వచ్చేవరకు ఎన్నికలపై ముందుకు వెళ్లకూడదన్న ధోరణిలోనే ప్రభుత్వం ఉంది. మరోవైపు తెదేపా తదితర విపక్ష పార్టీలు తాము మద్దతిచ్చే అభ్యర్థులతో సోమవారం నుంచే నామినేషన్లు వేయించాలన్న యోచనలో ఉన్నాయి. వారు నామినేషన్లు వేసేందుకు వచ్చినా తీసుకునేందుకు అధికారులు లేకపోతే ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి. తొలి దశలో ప్రకాశం, విజయనగరం మినహా 11 జిల్లాల్లోని 146 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఆర్వోల ఎంపికే జరగలేదు
పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని, వాటిని వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన ఏపీప్రభుత్వం.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని గానీ, నామినేషన్లు స్వీకరించాలని గానీ.. జిల్లా అధికారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఎలాంటి ఉత్తర్వులూ వెళ్లలేదు. ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆయా గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల వివరాల్ని రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) సోమవారం పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డుల్లో ప్రకటించి, నామినేషన్ల స్వీకరణ ప్రారంభించాలి. దీని కోసం జిల్లా, డివిజన్ పంచాయతీ కార్యాలయాల నుంచి ఆర్వోలు ఓటర్ల జాబితాలు, నామినేషన్ పత్రాలు, ఇతర సామగ్రి తీసుకుని ఆదివారమే నిర్దేశిత గ్రామ పంచాయతీలకు వెళ్లాలి. కానీ అదేమీ జరగలేదు అత్యధిక జిల్లాల్లో ఇప్పటికీ ఆర్వోలు, ఏఆర్వోల ఎంపిక ప్రక్రియే పూర్తి కాలేదు. కొన్ని జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారులు ఆర్వోలు, ఏఆర్వోల జాబితాలు సిద్ధం చేసినా.. కలెక్టర్లు ఆమోదముద్ర వేయలేదు.