తెలంగాణ

telangana

ETV Bharat / city

నివర్ తుపాను: కడప జిల్లాపై తీవ్ర ప్రభావం - nivar effect in kadapa district

నివర్‌ తుపాను ఏపీలోని కడప జిల్లాపై పెను ప్రభావమే చూపుతోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంపై తుపాను ప్రభావం అధికంగా ఉంది. కడప జిల్లా కేంద్రంలో భారీ వృక్షం రహదారిపై నేలకూలడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Nivar cyclone  major impact on Kadapa district in
నివర్ తుఫాను: కడప జిల్లాపై తీవ్ర ప్రభావం

By

Published : Nov 26, 2020, 4:40 PM IST

Updated : Nov 26, 2020, 5:07 PM IST

నివర్ తుఫాను ఏపీలోని కడపజిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. అత్యధికంగా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు, కడప నియోజకవర్గాల్లో వర్షం కురిసింది. రైల్వేకోడూరులో అత్యధింగా 24 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. ఈ ప్రాంతంలో గుంజినేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కుక్కలదొడ్డి వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు పొంగి ప్రవహిస్తుండటంతో కోడూరు- తిరుపతి వాహనాలు స్తంభించి పోయాయి. చిట్వేలి-రాపూరు రహదారిలో వంకలు, వాగులు ప్రవహిస్తున్నాయి. కోడూరు సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి బొప్పాయి, అరటి చెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

కడప జిల్లా కేంద్రంలో నెలకూలిన భారీ వృక్షం

రాజంపేటలో పోటెత్తిన జలశయాలు..

రాజంపేట నియోజకవర్గంలో వర్షం జోరుగా కురుస్తోంది. సుండుపల్లి మండలంలోని పింఛ జలాశయానికి వర్షపు నీరు పోటెత్తింది. పింఛ జలాశయం నుంచి 9 అడుగుల మేర గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా అన్నమయ్య ప్రాజెక్టులోకి చేరుతోంది. అన్నమయ్య ప్రాజెక్టులోకి 18 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 21 వేల క్యూసెక్కుల నీరు చెయ్యేరు నదిలోకి విడుదల చేశారు. ఒంటిమిట్ట మండలంలో వంకలు, వాగులు ప్రవహిస్తున్నాయి.

రెవెన్యూ డివిజన్ల వారిగా వర్షపాతం నమోదు వివరాలు..

రాత్రి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షంపాత వివరాలను అధికారులు లెక్కించారు. కడప, రాజంపేట, జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్ పరిధిలో వర్షపాతం వివరాలను అధికారులు విడుదల చేశారు. కడప రెవిన్యూ డివిజన్ పరిధిలో సగటున 46 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ డివిజన్​లో అత్యధికంగా సంబేపల్లి మండలంలో 140 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాజంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని 17 మండలాల్లో 1228 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా... సగటున 72 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ డివిజన్​లో అత్యధికంగా రైల్వేకోడూరులో 245 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్ పరిధిలోని 16 మండలాల్లో 239 మిల్లీమీటర్ల వర్షం కురవగా సగటున 15 మిల్లీమీటర్లు కురిసింది. ఈ డివిజన్ లో అత్యధికంగా మైదుకూరు మండలంలో 27 మిల్లీమీటర్లు కురిసింది.

నెలకొరిగిన చెట్టు....రాకపోకలకు ఇబ్బందులు

కడప నగరంలోని సీఎస్ఐ చర్చి వద్ద పెద్ద వృక్షం నేలవాలింది. సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు. వృక్షాన్ని తొలగించే చర్యలు చేపట్టారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, కమలాపురం, జమ్మలమడుగు, బద్వేలు ప్రాంతాల్లో కూడా తుపాను ప్రభావం అధికంగానే కనిపిస్తోంది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో అధికారులు పూర్తిగా అప్రమత్తం అయ్యారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి:భారీ వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు

Last Updated : Nov 26, 2020, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details