తెలంగాణ

telangana

ETV Bharat / city

చిరుధాన్యాలతో ఆరోగ్యం, ఆదాయం: అమితాబ్ కాంత్

చిరుధాన్యాల సాగు, వినియోగం పెంచడం వల్ల పోషకాహార భద్రతను పెంచవచ్చని... నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్​ అన్నారు. "అత్యవసర పౌష్టికాహార మార్కెట్‌ - చిరుధాన్యాల లభ్యతలు"పై జరిగిన జాతీయ స్థాయి వెబినార్‌ను దిల్లీ నుంచి ఆయన ప్రారంభించారు.

niti ayog ceo amithab kanth participate in national level webinar on positioning millets
చిరుధాన్యాలతో ఆరోగ్యం, ఆదాయం: అమితాబ్ కాంత్

By

Published : Sep 28, 2020, 7:25 PM IST

హరిత విప్లవం నేపథ్యంలో ఆహార భద్రత సాధించినప్పటికీ... ప్రస్తుతం పోషకాహార భద్రత మన ముందున్న పెద్ద సవాల్ అని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. దేశీయంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం, వినియోగం సైతం పెద్ద ఎత్తున పెంచినట్లైతే... రైతులకు ప్రోత్సాహక మద్ధతు ధరలు లభిస్తాయని తెలిపారు. 'రాష్ట్రీయ పోషణ్ మాహ్' పురస్కరించుకుని హైదరాబాద్ రాజేంద్రనగర్‌ జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థలో... ఐడీఏ, ఎన్‌ఎస్‌ఐ, ఐఎఫ్‌సీ, ఏఎఫ్‌ఎస్‌టీఐ ఆధ్వర్యంలో "అత్యవసర పౌష్టికాహార మార్కెట్‌ - చిరుధాన్యాల లభ్యతలు"పై జరిగిన జాతీయ స్థాయి వెబినార్‌ను దిల్లీ నుంచి ఆయన ప్రారంభించారు.

చిరుధాన్యాలతో ఆరోగ్యం, ఆదాయం: అమితాబ్ కాంత్

దేశీయంగా అంతరించిపోతున్న చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్న తరుణంలో... ప్రాసెసింగ్, నిల్వ, అదనపు విలువ జోడింపు, మార్కెటింగ్‌, వినియోగం, ఎగుమతులు పెంచడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సంప్రదాయ ఆహారం వదిలేసి పౌష్టిక విలువలు పెద్దగా లేని బియ్యం, గోధుమలు తీసుకోవడం వల్ల పెద్దలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం తలెత్తి అనారోగ్యాల పాలవుతున్నారని అమితాబ్ కాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.

కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఇతర ప్రొటీన్లు అధికంగా గల చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల బాగా ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని "మన్‌ కీ బాత్‌"లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారని తెలిపారు. నీటి సదుపాయాల్లేని పూర్తి ఆరుతడి ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగు చేయడం ద్వారా చక్కటి వాతావరణ ఆకర్షణీయ, సుస్థిర వ్యవసాయంగా మార్చుకోవచ్చని సూచించారు.

అంతర్జాతీయ విపణిలో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉన్నందున... భారత్‌లో బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు సాగు చేసి, ఎగుమతులు చేసేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని డాక్టర్ విలాస్ ఏ తొనాపి అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో కుటుంబసభ్యులందరి పళ్ళేల్లోకి చిరుధాన్యాలు తీసుకెళ్లడం ద్వారా గృహ వినియోగం భారీగా పెంచాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి మనోజ్‌ జోషి, ఒడిశా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గార్గ్‌, తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యా దేవరాజన్‌, ఐఐఎంఆర్ న్యూట్రీ హబ్ డైరెక్టర్ డాక్టర్ బి.దయాకర్‌రావు, వివిధ రాష్ట్రాల పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు, స్టార్టప్స్, చెఫ్‌ సంస్థలు, ఎఫ్‌పీఓల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు'

ABOUT THE AUTHOR

...view details