నిర్మల్ జిల్లా భైంసాలో చోటుచేసుకున్న ఘటన మానవత్వాన్ని అపహాస్యం చేసేలా ఉందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె సోమవారం భైంసాలో పర్యటించిన అనంతరం, రాత్రి హైదరాబాద్‌లో అక్కడి పరిస్థితుల గురించి వివరించారు. ఘటనకు మతం రంగు పులిమి పక్కదారి పట్టిస్తున్నారనే.. అనుమానం కలుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.
24 గంటల తర్వాత కూడా దాడులా?
భైంసాలో ఇరుపక్షాలతో మాట్లాడానని తెలిపారు. వారిలో ఘటన తాలూకు భయం ఇంకా పోలేదన్నారు. ఇది రెండు వర్గాల మధ్య జరిగిన ఘటన కాకుండా, రాజకీయ లబ్ధి కోసం ఇతరులు చేసినట్లుగా కనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన 24 గంటల తర్వాత కూడా దాడులు కొనసాగాయంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.