Vijayawada durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రి పై శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధనవమి నాడు జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా దర్శనమిస్తోంది. మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. నవదుర్గ రూపాల్లో ఈ రూపమే మహోగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది.
ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వలన సర్వదోషాలు తొలగిపోతాయని.. సాత్విక భావం ఉదయిస్తుందనేది భక్తుల నమ్మకం. మహిషాసురమర్దనిగా ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. దసరా ఉత్సవాల్లో పదో రోజైన రేపు రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. రేపటితో ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ముగియనున్నాయి