ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. నిమ్మగడ్డ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా నిమ్మగడ్డను తొలగించింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎస్ఈసీ నియామకానికి సంబంధించిన నిబంధనలను పూర్తిగా మార్చివేసింది. ఫలితంగా నిమ్మగడ్డ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది.
పదవీకాలం పూర్తయిందంటూ ఆయన్ను తొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించడం చట్టవిరుద్ధమని రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-కె ప్రకారం.. జగన్ ప్రభుత్వం తనను తొలగిస్తూ జారీ చేసిన జీవో రాజ్యాంగ వ్యతిరేకమని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఎస్ఈసీగా తనను తప్పించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ , జీవోలు తీసుకొచ్చిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్డినెన్స్ తీసుకురావాలి కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కాదన్నారు. ఆర్డినెన్స్ జారీ ద్వారా ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని ప్రభుత్వం తక్కువ చేసిందన్నారు. రాజ్యాంగాన్ని బైపాస్ చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు. ఎస్ఈసీని తొలగించే ప్రక్రియ రాజ్యాంగంలో నిర్దిష్ట విధానం ఉందన్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలన్న కేంద్ర ప్రభుత్వం సూచన చేసిందని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశానన్నారు. ఎన్నికలు వాయిదా వేసినందుకు ఏపీ అధికారపార్టీ సభ్యులు మీడియా ఎదుట తనపై విమర్శలు చేశారన్నారు. ఏపీ సీఎం జగన్ సైతం తన నియామకంపై అసమ్మతి తెలిపారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయకుండా ఉంటే కరోనా సందర్భంగా రాష్ట్రంలో దారుణ పరిణామాలు ఎదుర్కొని ఉండేవారని అన్ని వర్గాలు అభినందించాయన్నారు. కరోనా వైరస్ తీవ్రతను ముందుగా గుర్తించి ఎన్నికలు వాయిదా వేయటంతో ఆంధ్రా ప్రభుత్వం తనతో ఘర్షణకు దిగిందన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ తో పాటు జీవోలు 817 , 818 , 619ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. పదవీ కాలం ముగిసే వరకు తాను విధులు నిర్వహించేలా ఆదేశించాలని అభ్యర్ధించారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి పరిపాలనాపరమైన నిర్ణయం మేరకు ఈ వ్యాజ్యంపై త్వరలో విచారణ జరగనుంది.