రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు... బోసిపోయిన రహదారులు కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 9 గంటల నుంచే ఆంక్షలు విధించారు. మే 1 వరకు కర్ఫ్యూ దృష్ట్యా అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 8 గంటల వరకే తెరిచి ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. ఆసుపత్రులు, డయోగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మసీలకు మినహాయింపు నిచ్చిన ప్రభుత్వం... మీడియా, టెలికమ్యూనికేషన్లు, ఈ-కామర్స్ డెలివరీ, పెట్రోల్ పంపులు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, కోల్డ్ స్టోరేజీలు, ప్రైవేట్ సెక్యూరిటీ సేవలు, నిరంతరం ఉత్పత్తి చేసే సంస్థలు, సేవలకు వెసులుబాటు ఇచ్చింది. రైల్వేస్టేషన్లు విమానాశ్రయాలు, బస్టాండ్ల నుంచి వచ్చే వారు టికెట్లు చూపితే అనుమతిస్తారు. అంతర్‌రాష్ట్ర, అంతర్ జిల్లా సరుకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
వాహనాలు రద్దీ, ప్రయాణికుల రాకపోకలతో నిత్యం రద్దీగా హైదరాబాద్ మహానగర రోడ్లన్నీ కర్ఫ్యూ అమలుతో నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా రాత్రికర్ఫ్యూను పక్కాగా అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో దృశ్యమాధ్య సమీక్ష నిర్వహించారు. అత్యవసరాలు, హెల్త్ ఎమర్జెన్సీ వంటి వాటికి మినహాయింపులిస్తూ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూను రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీచేశారు . నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించాలని సూచించారు.
భాగ్యనగరంలో రాత్రి 8 గంటల నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేసేలా పోలీసులు చర్యలు చేపట్టారు. కర్ఫ్యూ తొలిరోజున వాహనదారులు ముందస్తు ఏర్పాట్లు , ప్రణాళికల్లేక హడావుడిగా ఇళ్లకు పరుగులు తీశారు . బస్సులు, మెట్రో సేవలను రాత్రి 8 గంటలకే నిలిపివేశారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ బషీర్‌బాగ్ పరిసరాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కూకట్‌పల్లి పరిసరాల్లో..రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఉప్పల్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న బందో బస్తుతో పాటు కర్ప్యూ అమలును పరిశీలించారు .కర్ప్యూ వేళ ఎవరూ బయట తిరగకుండా ప్రజలు సహకరించాలని కోరారు.
కరోనా కేసులు పెరిగుతున్నందునే ముందుజాగ్రత్తగా రాత్రి కర్ఫ్యూ విధించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన కోవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు . నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ సీపీ హెచ్చరించారు . పోచంమైదాన్ కూడలి వద్ద వాహనాలు తనిఖీచేసిన పోలీసులు తొలిరోజు మందలించి వదిలేశారు. మహబూబాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న దుకాణ యజమానులకు జరిమానా విధించారు . కరీంనగర్‌లో రాత్రి కర్ఫ్యూతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపారులు స్వచ్చందంగా రాత్రి 8గంటలకే దుకాణాలు మూసేశారు. కర్ఫ్యూ అమలు పరిస్థితిని సీపీ కమలాసన్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ప్రజలు స్వీయనియంత్రణతో వైరస్ మహమ్మారిని తరిమికొట్టాలని సీపీ పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్‌లో గంట ముందుగానే దుకాణాలు మూసివేశారు . తొమ్మిది తర్వాత జన సంచారం కనిపించలేదు . మంచిర్యాలలో రహదారులు బోసిపోయి కనిపించాయి. రహదారులపై తిరుగుతున్న వాహనాలను ఆపిన పోలీసులు తనిఖీలు చేసి అత్యవసర సేవల సిబ్బందిని మాత్రమే అనుమతించారు . నిజామాబాద్‌లో కర్ఫ్యూ అమలును పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ కర్ఫ్యూ పక్కాగా అమలు చేస్తున్నారు. రాత్రివేళ రోడ్లపై తిరుగుతున్న వాహనదారులకు సీపీ విష్ణువారియర్ పలు సూచనలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి కర్ఫూ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. తొలిరోజున పోలీసులు అవగాహన కల్పించి దుకాణాలు మూసి వేయించారు. అత్యవసరాల కోసం తప్ప జనం బైటకు రావద్దని పోలీసులు మైకుల ద్వారా ప్రచారం నిర్వహించారు.