రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొంది. ఎన్ని ఆంక్షలు విధించినా.. మాస్క్ వినియోగం, భౌతిక దూరం వంటి నిబంధనలపై ఎంత అవగాహన కల్పించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడం వల్ల.. కఠిన ఆంక్షలకు ప్రభుత్వం ఉపక్రమించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి కర్ఫ్యూ విధింస్తున్నట్లు ప్రకటించింది. ఈ రాత్రి నుంచి మే 1 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
సర్కారు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 9 గంటలకు కర్ఫ్యూ ప్రారంభమైంది. చాలా చోట్ల రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవల సిబ్బందిని మాత్రమే పోలీసులు మినహాయింపునిస్తున్నారు. ఉల్లంఘనలపై విపత్తు నిర్వహణ, ఐపీసీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.