తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్ఐఏ సోదాలు.. నాంపల్లి కోర్టులో నలుగురిని హాజరుపర్చిన అధికారులు

NIA Produced four people in court: ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో నిఘా పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్న నలుగురిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దేశవ్యాప్తంగా పీఎఫ్​ఐ ఉగ్ర సంబంధ శిక్షణా కార్యక్రమాలకు పాల్పడిన మరో 26 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. పలు కంప్యూటర్ హార్డ్​డిస్క్​లు, కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు.

NIA
NIA

By

Published : Sep 19, 2022, 4:48 PM IST

NIA Produced four people in court: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్న నలుగురుని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పలు కంప్యూటర్ హార్డ్​డిస్క్​లు, కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్​ఐ) కేసులో... తెలుగు రాష్ట్రాల్లో 40 చోట్ల అధికారులు ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టిన అధికారులు... నిన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 38 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు... పలు చరవాణీలు, పాస్ పోర్టులు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు, డైరీలు స్వాధీనం చేసుకుని.. కోర్టుకు తీసుకవచ్చారు.

NIA Searches in PFI case: ఆదివారం ఉగ్రమూలాలు ఉన్నాయనే అనుమానంతో పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా సంస్థ శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో 38 చోట్ల సోదాలు చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్​లోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సూరారం సాయిబాబా నగర్​లోని జమీయ తలిముల్ఇస్లాం మదరసాలో సోదాలు నిర్వహించారు. కంప్యూటర్ హార్డ్​డిస్క్​లు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఉపాధ్యాయుడిని పీఎఫ్ఐ సభ్యుడిగా గుర్తించి.. అతడి సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 23 చోట్ల జల్లెడ పట్టారు. నగరంలోని కంఠేశ్వర్​కు చెందిన ఓ వ్యక్తిని.. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు. ఎడపల్లి మండలం ఎమ్మెస్సీ ఫారంలో ఓ యువకుడి ఇంట్లో సోదాలు చేపట్టి.. రెండు చరవాణులు, పాస్​పోర్టు, బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోనూ దాడులు జరిగాయి. ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్ కాలనీలో ఓ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్​ నుంచి వచ్చి కొంతకాలంగా నివాసం ఉంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిర్మల్​ జిల్లాలోనూ రెండుచోట్ల విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. భైంసాలోని మదీనా కాలనీలో కొందరి ఇళ్లలో సోదాలు నిర్వహించి పీఎఫ్​ఐ సంస్థ శిక్షణ కార్యక్రమాలపై ఆరా తీశారు.

జగిత్యాల జిల్లాలో భారీ భద్రత నడుమ ఏడుచోట్ల ఏకకాలంలో ఎన్​ఐఏ సోదాలు జరిపింది. టవర్ సర్కిల్​లోని కేర్​ మెడికల్​లో తనిఖీలు చేపట్టేందుకు నాలుగు వాహనాల్లో అధికారులు వచ్చారు. దుకాణం తాళాలు పగులకొడుతుండగా మహిళలు అడ్డుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో యజమానిని పిలిపించి తాళం తెరిపించారు. అనంతరం దుకాణంలోని సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. అనుమానితుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. వారి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్​లోనూ ఓ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఉగ్రమూలాలు ఉన్నాయనే ఆధారాలతో సోదాలు చేపట్టడం కలకలం రేపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details