ప్రజా సంఘాల పేరుతో మావోయిస్టు పార్టీ వ్యూహాత్మక అనుబంధ ఫ్రంట్ ఏర్పాటు చేసుకుందని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ముంచంగిపుట్టు కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం న్యాయస్థానంలో ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ ఇంఛార్జీ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేతో పాటు జర్నలిస్టు పంగి నారాయణ, అమరుల బంధు మిత్రుల సంఘం నాయకురాలు బొప్పూడి అంజమ్మ, చైతన్య మహిళ సంఘం నాయకురాలు రేలా రాజేశ్వరి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నేతలు అందులూరి అన్నపూర్ణ, జంగాల కోటేశ్వర్ రావు అలియాస్ కోటి, విరసం నేత మానుకొండ శ్రీనివాసరావుపై ఎన్ఐఏ అభియోగపత్రం సమర్పించింది. ప్రజా సంఘాల ముసుగులో ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని విస్తరించి, బలోపేతం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఎన్ఐఏ పేర్కొంది. వారిపై అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాల చట్టాల కింద అభియోగాలు నమోదు చేసింది.
మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్న అభియోగంపై 2020 నవంబరు 23న జర్నలిస్టు పంగి నారాయణను ఏపీలోని విశాఖ జిల్లా ముంచింగిపుట్టు పోలీసులు అరెస్టు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా గతేడాది మార్చి 7న దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టింది. ఏపీ సహా కొన్ని రాష్ట్రాల్లోని పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు, మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల ఇళ్లల్లో ఇటీవల సోదాలు జరిపిన ఎన్ఐఏ.. పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. విరసం, అమరవీరుల బంధుమిత్ర సంఘం, ప్రగతి శీల కార్మిక సమాఖ్య, చైతన్య మహిళ సంఘం మావోయిస్టు పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నాయని ఎన్ఐఏ వెల్లడించింది.