ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తూర్పు నౌకాదళ స్థావరం గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి ముంబయి వాసి అబ్దుల్ రెహమాన్ జబ్బార్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. నిందితుని ఇంటి నుంచి సాంకేతిక పరికరాలు, ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జబ్బార్ భార్యను అరెస్టు చేసిన ఎన్ఐఏ.. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో చర్యలు తీసుకున్నారు.
నౌకాదళ స్థావరాలపై ఐఎస్ఐకు సమాచారం ఇచ్చారంటూ గతంలో 11 మంది నౌకాదళ ఉద్యోగులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ కేసులో మహమ్మద్ హాజీ అనే వ్యక్తిని గత నెలలో అరెస్టు చేసిన ఎన్ఐఏ.. ఇప్పటి వరకు మొత్తం 15 మందిని కటాకటాల్లోకి నెట్టింది.
నౌకాదళానికి సంబంధించి కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐకు చేరవేస్తున్న వైనాన్ని నిఘా సంస్థలు రట్టు చేశాయి. భారత్‌లో ఉన్న నౌకాదళ స్థావరాలు, జలాంతర్గాములు, రక్షణ సమాచారాన్ని తెలుసుకునేందుకు కొంతమంది గూఢచారులను పాకిస్థాన్ గూఢచర్య సంస్థలు నియమించినట్లు అధికారులు గుర్తించారు.
కొంతమంది నేవీ సిబ్బంది ఫేస్బుక్, వాట్సాప్ సామాజిక మాధ్యమాల ద్వారా.. పాకిస్థాన్ పౌరులతో సంప్రదింపులు జరిపారని.. గత నెలలో ఎన్ఐఏ తెలిపింది. కీలక సమాచారాన్ని అక్కడికి చేరవేసినట్లు గుర్తించామని పేర్కొంది. ఇందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్‌లో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న భారతీయ సహచరుల ద్వారా నగదు నేవీ సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:నకి'లీలలు': చాపకింద నీరులా నకిలీ విత్తనాల వ్యాపారం