తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలవరం డయాఫ్రం వాల్‌ భవితవ్యం తేలేది వచ్చే ఏడాదే - పోలవరం

Polavaram project: ఏపీలోని పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చేందుకు 145 రోజులు పడుతుందని నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) వెల్లడించింది. డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేలిన తర్వాతే.. నిర్మాణం యథావిధిగా కొనసాగించవచ్చా? చిన్నచిన్న మార్పులు సరిపోతాయా? పూర్తిగా కొత్తది నిర్మించాల్సి ఉంటుందా అనే దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది.

పోలవరం డయాఫ్రం వాల్‌ భవితవ్యం తేలేది వచ్చే ఏడాదే
పోలవరం డయాఫ్రం వాల్‌ భవితవ్యం తేలేది వచ్చే ఏడాదే

By

Published : Sep 3, 2022, 10:08 AM IST

Polavaram project: ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చేందుకు 145 రోజులు పడుతుందని నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) వెల్లడించింది. డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేలిన తర్వాతే.. నిర్మాణం యథావిధిగా కొనసాగించవచ్చా? చిన్నచిన్న మార్పులు సరిపోతాయా? పూర్తిగా కొత్తది నిర్మించాల్సి ఉంటుందా అనే దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. గోదావరి నదికి జులై నుంచి భారీ వరదలు పోటెత్తాయి. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య వరద చేరింది. ఆ రెండింటి మధ్యలో రాతిమట్టి కట్టతో డ్యాం నిర్మించాల్సిన ప్రదేశంలోనే డయాఫ్రం వాల్‌ ఉంది. అక్కడ ప్రస్తుతం వరద ఉంది. సామర్థ్య పరీక్షలు చేపట్టే పరిస్థితుల్లేవు. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గాలంటే సెప్టెంబరు చివరి వరకు ఆగాలి. ఆ తర్వాతైనా కొంత మేర నీటిని ఎత్తిపోస్తేనే పనులు సాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల మధ్య డయాఫ్రం వాల్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఎంత లేదన్నా ఫిబ్రవరి వరకు ఆగాల్సి ఉంటుందని అంచనా.

సమగ్ర విధానంపై నివేదిక..:దాదాపు 1.38 కి.మీ. పొడవున డయాఫ్రం వాల్‌ ఉంది. అది నదీ గర్భంలో ఇసుక పొరల్లో కొన్నిచోట్ల 90 అడుగులు, మరికొన్ని చోట్ల 300 అడుగుల లోతు నుంచి నిర్మించారు. డయాఫ్రం వాల్‌ పొడవునా ఎలక్ట్రోడ్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యుత్తు ప్రవహింపజేసి, ఆ ప్రవాహ తీరు ఆధారంగా సామర్థ్యం తేల్చనున్నారు. దీనిపై ఎన్‌హెచ్‌పీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కపిల్‌ ఇప్పటికే పోలవరం అధికారులకు ఒక సమగ్ర నివేదిక పంపినట్లు తెలిసింది. ఎన్‌హెచ్‌పీసీ కోరినట్లు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేసి, సమాచారం ఇస్తే పరీక్షలకు నిపుణులు రానున్నారు. వరద తగ్గాక ఆ ఏర్పాట్లు చేసేందుకే 145 రోజులు పడుతుందని అంచనా.

ABOUT THE AUTHOR

...view details