తెలంగాణ

telangana

ETV Bharat / city

'అమరావతికి ముంపు ముప్పే లేదు'..నాడే తేల్చిన ఎన్జీటీ!

కృష్ణా నది ఒడ్డున ఉన్న రాజధాని అమరావతికి వరద ముంపు ఉందన్న వాదనలో వాస్తవం లేదని.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) రెండేళ్ల క్రితం వెలువరించిన తీర్పు స్పష్టం చేస్తోంది. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర పర్యావరణ ప్రభావ అధ్యయన అథారిటీ ఇచ్చిన అనుమతుల్లో ఎలాంటి లోపం లేదని ట్రైబ్యునల్‌ తేల్చి చెప్పింది. ‘‘ఆ ప్రాంతం గత 106 ఏళ్లుగా ఎలాంటి వరద తాకిడికీ గురికాలేదు. అసాధారణ వరదల సమయంలోనూ అక్కడ నది గట్టు దాటి ప్రవహించలేదు’’ అని కుండ బద్దలుకొట్టింది. ప్రజా రాజధాని అమరావతి తరలింపు చర్చనీయాంశమైన నేపథ్యంలో.. ఎన్జీటీ ఇచ్చిన కీలక తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

amaravathi
'అమరావతికి ముంపు ముప్పే లేదు'..నాడే తేల్చిన ఎన్జీటీ!

By

Published : Jan 15, 2020, 9:39 AM IST

'అమరావతికి ముంపు ముప్పే లేదు'..నాడే తేల్చిన ఎన్జీటీ!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా రాజధాని ప్రాజెక్టు ఉందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) గతంలోనే వ్యాఖ్యానించింది. వరద ముంపు ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తున్నారన్న వాదన సరికాదని ఎన్జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ నేతృత్వంలోని బెంచ్‌ 2017 నవంబరులో తీర్పు ఇచ్చింది. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ పలువురు ఎన్జీటీని ఆశ్రయించగా.. ఈ తీర్పు వెలువడింది.

రాజధాని ప్రాంతం రాష్ట్రానికి మధ్యలో ఉండటం వల్ల ఇతర ప్రాంతాలకు సులభంగా అనుసంధానమై ఉందని కూడా ఎన్జీటీ పేర్కొంది. ఇప్పటికే పలు సౌకర్యాలు ఉన్నందున రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం పడదని తెలిపింది. తద్వారా పర్యావరణంపై పడే నష్టం తగ్గింపునకు సహాయపడినట్టేనని పేర్కొంది. ‘‘రాజధాని అధ్యయనంపై కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీ తన నివేదికలో.. రాజధాని నగర నిర్మాణ ప్రదేశంపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారం ఉందని స్పష్టం చేసింది. రాజధానిపై 4,728 స్పందనలు అందగా విజయవాడ-గుంటూరు ప్రాంతానికి అత్యధిక ప్రజలు ఓటు వేశారని కమిటీ చెప్పింది’’ అని ఎన్జీటీ గుర్తుచేసింది.

కొండవీటి వాగు అడ్డంకి కాదు
రాజధాని ప్రాంతం గత 106 ఏళ్లుగా ఎలాంటి వరద తాకిడికి గురికాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొండవీటి వాగు ఆక్రమణలకు గురికావడం వల్ల కుచించుకుపోయింది. వాగును అభివృద్ధి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వాగు రాజధాని నిర్మాణాలకు అడ్డంకి అని చెప్పలేం.
అభ్యంతరాలు స్వీకరించారు
రాజధానికి సంబంధించి ప్రతి దశలో ప్రజా ప్రయోజనాన్ని పరిగణనలోకి తీసుకొని.. ప్రభుత్వం ప్రజా సంప్రదింపులు జరిపింది. ముసాయిదా ప్రణాళికను సైతం ప్రజలకు అందుబాటులో ఉంచారు. అభ్యంతరాల్ని స్వీకరించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్నాకే మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి నోటిఫై చేశారు. భూ యజమానులతో సంప్రదింపులు జరిపి ల్యాండ్‌ పూలింగ్‌ లేఅవుట్‌లను ఖరారు చేశారు.
షరతులు విధించాకే అనుమతులు
కేటగిరి-ఏ కిందకు వచ్చే అభివృద్ధి పనులు (విమానాశ్రయం, జాతీయ రహదారులు..) ముడిపడి ఉన్నందున పర్యావరణ అనుమతులు ఇచ్చే అధికారం ఎస్‌ఈఐఏఏకు లేదన్న పిటిషనర్ల వాదనతో విభేదిస్తున్నాం. మాస్టర్‌ ప్లాన్‌లో విమానాశ్రయం ప్రస్తావన లేదని అధికారులు చెబుతున్నారు. అలానే ప్రభుత్వం పలు అంశాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశాకే 90 షరతులు విధించి ఎస్‌ఈఐఏఏ పర్యావరణ అనుమతులు ఇచ్చింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పర్యావరణ అనుమతి ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వుల రద్దుకు నిరాకరిస్తున్నాం.
సమతౌల్యాన్ని సాధించాలి
పర్యావరణాన్ని కాపాడటం.. రాజధాని నగరం అభివృద్ధి మధ్య రాష్ట్ర ప్రభుత్వం సమతౌల్యం సాధించాలి. భవిష్యత్తులో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మేము ఇచ్చే ఆదేశాలు పర్యావరణ అనుమతుల్లో భాగం. నీటి తరలింపు, నీటి నిల్వలు, చెరువులు/కుంటల అభివృద్ధి పనులు చేసేందుకు వరద మైదాన ప్రాంతాల్ని మార్చాల్సి వస్తే అధ్యయనం చేయాలి. రాజధాని నగరంలోని 251 ఎకరాల అటవీ భూముల్ని.. రాజధాని నగరానికి ప్రాణవాయువును ఇచ్చేవిగా అలాగే ఉంచాలి. మా ఆదేశాలు అమలయ్యేలా చూసేందుకు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఆరు నెలలకోసారి ట్రైబ్యునల్‌కు నివేదిక ఇవ్వాలి’’ అని ఎన్జీటీ ఆదేశాలు జారీచేసింది.
పిటిషనర్లు/దరఖాస్తుదారులు

  • ‘రాజధాని నగర బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) కృష్ణా నది వరకూ విస్తరించి ఉంది. దీంతో నదీ పరివాహక ప్రాంతానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉంది.
  • రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతున్న ప్రాంతంలో గతంలో భారీగా వరదలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఆ ప్రాంత భూములు సారవంతమైనవి. వివిధ రకాల పంటలు పండుతాయి.
  • గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా నల్లరేగడి నేలలు ఉన్నందున ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆ భూములు తగినవి కావు. వ్యవసాయ భూములు, కృష్ణా నది వరద మైదాన (ఫ్లడ్‌ ప్లెయిన్స్‌) ప్రాంతాల్లో నిర్మాణాలు జరపకుండా ఆదేశించాలి.
  • నగర నిర్మాణ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇస్తూ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అధ్యయన అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) 2015 అక్టోబరు 9న జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలి.
  • ఒక వేళ నిర్మాణాలు చేపట్టాలంటే ‘ప్రాజెక్టు నష్ట అధ్యయనం’ చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఆర్‌డీఏ

  • ‘నివేదికలు పరిశీలించి, భాగస్వాముల (స్టేక్‌హోల్డర్స్‌)తో సంప్రదింపులు జరిపాకే అమరావతి రాజధాని నగరం నిర్మాణానికి తగిన ప్రదేశమని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
  • రవాణా సౌకర్యాలు, నీటి లభ్యత తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నాం. రాజధాని అభివృద్ధి చెందాలంటే సౌకర్యాలు అవసరం.
  • రాజధాని నిర్మాణం కేవలం అధునాతన, అభివృద్ధి పనుల్ని చేపట్టడానికి మాత్రమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించేదిగా ఉంటుంది. చట్ట నిబంధనలకు లోబడి పర్యావరణ అనుమతులు పొందాకే అభివృద్ధి పనులు జరుపుతున్నాం.
  • రాజధాని నగర నిర్మాణ ప్రాంతం ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువన ఉంది. కొండవీటి వాగువల్ల రాజధానిపై ప్రభావం పడదు. రుతుపవనాల సమయంలోనే ఆ వాగు ప్రవహిస్తుంది. మిగిలిన కాలమంతా ఎండి ఉంటుంది. పిటిషనర్లు చేస్తున్నవి నిరాధార ఆరోపణలు.

వరద ముంపు ప్రాంతంలో, కృష్ణా నది వరదకు ప్రభావితమయ్యే ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయడం లేదు. ప్రతిపాదిత రాజధాని బంగాళాఖాతానికి దూరంగా ఉంది. తుపానుల ప్రభావం ఉండదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం రాజధాని నగరం.. మెట్ట భూముల్లో నిర్మాణం అవుతుంది. వరద తాకిడికి గురయ్యే ప్రమాదమే లేదు.

ఇవీ చూడండి: నేడు 'మకర జ్యోతి' దర్శనం.. భద్రత కట్టుదిట్టం

ABOUT THE AUTHOR

...view details