తెలంగాణ

telangana

ETV Bharat / city

NGT : రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేఆర్​ఎంబీకి ఎన్జీటీ ఆదేశం - ngt orders to krishna river management board

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించి వారంలోగా నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(NGT)కు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సర్కార్ చేపట్టిన పనులు.. ప్రాజెక్టు నివేదిక కోసమా.. ప్రధాన ప్రాజెక్టు పనులకా అన్నది పరిశీలించాలని స్పష్టం చేసింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేఆర్​ఎంబీకి ఎన్జీటీ ఆదేశం
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేఆర్​ఎంబీకి ఎన్జీటీ ఆదేశం

By

Published : Aug 10, 2021, 7:06 AM IST

ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి వారంలోగా నివేదిక సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(NGT) (కేఆర్‌ఎంబీ)కి సోమవారం చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి గత అక్టోబరు 29న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందంటూ జి.శ్రీనివాస్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లపై సోమవారం ఎన్జీటీ జ్యుడిషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సభ్యుడు డాక్టర్‌ కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పథకాన్ని సందర్శించి నివేదిక ఇవ్వడానికి మూడు వారాల గడువు అవసరమని కేఆర్‌ఎంబీ తరపు న్యాయవాది అభ్యర్థించారు. కమిటీలో కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ)కి చెందిన దేవేందర్‌ తెలంగాణాకు చెందిన వ్యక్తి అని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని నియమించడానికి గడువు అవసరమని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ ప్రాజెక్టు సందర్శనకు ప్రత్యేకంగా నైపుణ్యం అవసరం లేదని, న్యాయవాదుల కమిషన్‌ కూడా వెళ్లి చూసి రావచ్చని వ్యాఖ్యానించింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనులు... ప్రాజెక్టు నివేదిక కోసమా (డీపీఆర్‌), ప్రధాన ప్రాజెక్టు పనులకా అన్నది పరిశీలించాలని స్పష్టం చేసింది.

‘పాలమూరు రంగారెడ్డి’పై నేడు విచారణ

మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2 నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ఈనెల 10న చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీ(NGT) మంగళవారం విచారణ చేపట్టనుంది. ప్రజాభిప్రాయాన్ని నిలిపివేయాలని కోరుతూ కడప జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వరరెడ్డి, మరో 8 మంది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీ ధర్మాసనం విచారణ చేపట్టగా తెలంగాణ తరపున హాజరైన అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు గడువు కోరారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.కేశవరావు మృతి నేపథ్యంలో ఈ విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. ధర్మాసనం అనుమతిస్తూ నేటికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details