తెలంగాణ

telangana

ETV Bharat / city

'రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి' - రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ తీర్పు వార్తలు

పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకు వెళ్లొద్దని... జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి తీసుకోవాలన్న అంశం జోలికి తాము వెళ్లడం లేదన్న ఎన్జీటీ... పర్యావరణ అనుమతుల అవసరాన్ని గుర్తించినట్లు పేర్కొంది.

ngt-on-rayalaseema-project
'రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి'

By

Published : Oct 30, 2020, 5:34 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం తేల్చిచెప్పింది. ఆ అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని స్పష్టం చేసింది. జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, నిపుణుడు సైబల్‌దాస్‌ గుప్తాలు ఈ మేరకు గురువారం తీర్పు వెలువరించారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా బోర్డుకు సమర్పించి వారి అనుమతి తీసుకుంటే కానీ పనులు చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుకు కృష్ణా బోర్డు అనుమతి కావాలా లేదా అన్న విషయంలో తాము జోక్యం చేసుకోనక్కర్లేదని స్పష్టం చేసింది.

డీపీఆర్‌ను మదించిన తర్వాత బోర్డే ఆ విషయాన్ని తేలుస్తుందని ధర్మాసనం పేర్కొంది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చెన్నై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. కేంద్ర పర్యావరణశాఖ, కేంద్ర జలశక్తిశాఖ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చారు. ఎన్జీటీ ఈ విషయాన్ని నిపుణుల కమిటీకి అప్పగించింది. నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ అధికారులతో సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కేంద్రం ధర్మాసనానికి సమర్పించింది. పర్యావరణ అనుమతులు అవసరమో కాదో తేల్చాలని ఎన్జీటీ కేంద్ర పర్యావరణశాఖను ఆదేశించింది. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, దీనికి పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ వాదించింది. తమ వాదనతో నిపుణుల కమిటీ కూడా ఏకీభవించిందని ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని తెలంగాణ వాదించింది. వాదనలు విన్న ఎన్జీటీ ధర్మాసనం ఆగస్టు 11న విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వు చేసింది.

మళ్లీ కేసు తెరిపించిన తెలంగాణ
ఈ పథకం వల్ల తెలంగాణ నష్టపోతుందని, అందువల్ల తమ అభిప్రాయాన్ని వినడానికి కేసును మళ్లీ తెరవాలని ఆ రాష్ట్రం మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం ఉంటుందని, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా చేపడుతుండటం వల్ల శ్రీశైలం వట్టిపోతుందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ధర్మాసనం మళ్లీ వాదనలు వింది. ఈ ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు అని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొందని తెలంగాణ వాదించింది. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, 15 టీఎంసీలు తాగునీటి కేటాయింపులు వాడుకునేందుకు కొత్త ఏర్పాటు మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.

తీర్పును పరిశీలించి తదుపరి నిర్ణయం: ఏపీ

చెన్నై ధర్మాసనం ఇచ్చిన తీర్పును లోతుగా పరిశీలించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని ఏపీ జలవనరులశాఖ అధికారులు చెప్పారు. నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతులు అవసరం లేదని కూడా చెప్పిందని గుర్తు చేశారు.

మా పోరాటం ఫలించింది: తెలంగాణ

రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తెలంగాణ పోరాటం ఫలించిందని ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ కమిటీ ఇచ్చింది తప్పుడు నివేదిక అన్న తెలంగాణ వాదనలతో ధర్మాసనం ఏకీభవించిందని చెప్పాయి.

ఇవీ చూడండి: నేటి నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్

ABOUT THE AUTHOR

...view details