రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. ఎన్జీటీ ఇచ్చిన తీర్పును ధిక్కరించి ప్రాజెక్టు పనులు సాగిస్తున్నారని.. గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి సమాధానం ఇవ్వకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు సాగిస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషన్‌పై జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబర్ దాస్ గుప్త బెంచ్ విచారణ చేపట్టింది.
'సరైన వివరణ ఇవ్వకపోతే.. తగిన ఆదేశాలిస్తాం' - రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వార్తలు
ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ తీర్పును ధిక్కరించి.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు సాగిస్తోందన్న పిటిషన్‌పై... జాతీయ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న బెంచ్.. విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది.
ఎటువంటి అనుమతులు లేకుండానే.. పేలుళ్లకు పాల్పడి పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ట్రైబ్యునల్‌కు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. కేవలం డీపీఆర్ రూపొందించటానికి అవసరమైన పరీక్షలు తప్ప.. ప్రాజెక్టు పనులు చేపట్టడం లేదని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. త్వరలోనే వివరణ ఇస్తామని వెల్లడించారు.
ఎన్జీటీకి వివరణ ఇవ్వకుండా పనులు చేపట్టడం భావ్యం కాదని ట్రైబ్యునల్ ధర్మాసనం పేర్కొంది. సీనియర్ న్యాయవాది ఇచ్చిన వాగ్దానం మేరకు ఎన్జీటీ బెంచ్ విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆమోదయోగ్యంగా లేకపోతే.. తగిన ఆదేశాలు ఇస్తామని జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో ఎన్జీటీ బెంచ్ హెచ్చరించింది.
- ఇదీ చదవండి :శ్మశానంలో బారసాల.. ఎందుకో తెలుసా?