తాను ప్రియాంక గాంధీ వర్గంలో చేరానని, ఆమె నాయకత్వాన్ని ప్రచారం చేస్తున్నానని సోషల్ మీడియాలో వస్తున్న కథనం పూర్తిగా అవాస్తవం, నిరాధారమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్‌లో వర్గాలకు తావు లేదని... కింది స్థాయి కార్యకర్త నుంచి సీడబ్ల్యుసీ సభ్యుడి వరకు అందరు ఒకటేనని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో సమర్థవంతంగా.. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని వివరించారు. సామాజిక మాధ్యమాలలో తన పేరుతో వైరల్ అవుతున్న కథనాలను ఖండిస్తూ... రేవంత్ రెడ్డి ఓ లేఖను ట్వీట్ చేశారు.
నాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవం: రేవంత్ - mp revanth reddy speech
తన ఎదుగుదలను గిట్టనివారు, రాజకీయ ప్రత్యర్థులు దురుద్దేశపూర్వకంగా ప్రచారాలకు పూనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను ప్రియాంక గాంధీ వర్గంలో చేరానని, ఆమె నాయకత్వాన్ని ప్రచారం చేస్తున్నానని సోషల్ మీడియాలో వస్తున్న కథనం పూర్తిగా అవాస్తవం, నిరాధారమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో వర్గాలకు తావు లేదని స్పష్టం చేశారు.
ఏలాంటి ఆధారాలు, వివరణలు లేకుండా ప్రచారంలోకి వచ్చే కథనాలకు ఏ మాత్రం విలువుండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాజీవితంలో చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు నైతిక స్థైర్యం దెబ్బతీయడానికో... రాజకీయ ఎదుగుదలను నియంత్రించేందుకో... ప్రత్యర్థులు కుయుక్తులు పన్నుతుంటారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఉన్నవీ... లేనివి పోగేసి దుష్ప్రచారం చేయడం తేలికైందని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనను అభిమానించే వారు అత్యుత్సాహం ప్రదర్శించి పరువు పోయేట్లు పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. తన ఎదుగుదలను గిట్టనివారు, రాజకీయ ప్రత్యర్థులు దురుద్దేశపూర్వకంగా ప్రచారాలకు పూనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రచారాలు ఎవరు చేసినా... వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.