New Year Celebrations in Hyderabad: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా.. వేడుకలకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. మరో వైపు ఎలాంటి అంవాఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
భాగ్యనగరంలో న్యూ ఇయర్ జోష్
New Year Events in Hyderabad : కరోనా నిబంధనలు పాటిస్తూ.. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన జరగకుండా వేడుకలు నిర్వహించుకోవాలని అల్టిమేటర్ జారీ చేసింది. ప్రశాంత వాతావరణంలో.. ఎంతో ఉత్సాహంగా.. కోలాహలంగా.. జోష్‌ఫుల్‌గా న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తుకు రంగం సిద్ధం చేసింది. నగరవ్యాప్తంగా పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, ఈవెంట్లు ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్‌లు, ట్రాఫిక్ అధికారులు సమీక్షించి వేడుకల దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలపై ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈరోజు రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు ఓఆర్ఆర్పై కార్లకు అనుమతి లేదని కేవలం లారీలు, గూడ్స్ వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
తాగి నడిపితే.. అంతే సంగతి..
New Year Party in Hyderabad : రాచకొండ పరిధిలో ఉన్న అన్ని పైవంతెనలు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. క్యాబ్, డ్రైవర్లు యూనిఫారమ్ ధరించాలని ఆదేశించారు. ప్రజలు గమ్యస్థానాలకు వెళ్లేందుకు రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే క్యాన్సిల్ చేయకూడదని.. ఇలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.500 వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. ఎటువంటి సమస్య ఉన్నా ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ ద్వారా (9490617111) తెలపాలని కోరారు. మరోవైపు బార్లు, పబ్బులు, క్లబ్బుల నుంచి బయటకు వచ్చిన కస్టమర్లు తాగి వాహనం నడపకుండా చూసే పూర్తి బాధ్యత యజమానులదేనని చెప్పారు. వారికోసం ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే కేసు నమోదు చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని వివరించారు.
ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుందాం..
New Year 2021 : సైబరాబాద్ పోలీసులు కూడా ఇదే తరహా ఆంక్షలు విధించారు. కమిషరేట్ పరిధిలోని విమానాశ్రయానికి వెళ్లే ఓఆర్ఆర్పై ఇవాళ రాత్రి 10 నుంచి ఉదయం 5గంటల వరకు కార్లు అనుమతించమన్న పోలీసులు.. కమిషనరేట్ పరిధిలో అన్ని పై వంతెనలు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు మూసి వేస్తామన్నారు. దుర్గం చెరువు తీగల వంతెన సహా, హైటెక్ సిటీ, జేఎన్‌టీయూ, బాలానగర్ పైవంతెనలు మూసివేస్తామని తెలిపారు. తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే 10-15వేల వరకు జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. పబ్‌లు, క్లబ్‌లు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. శాంతియుత వేడుకలే మన లక్ష్యమని సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
జీరో యాక్సిడెంట్లే లక్ష్యం..
New Year 2022 Events in Hyderabad : నూతన సంవత్సర వేడుకలను ఎంజాయ్ చేయండి కానీ న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే కట్టిన చర్యలు తీసుకుంటామన్న ఆయన.. మద్యం సేవించి డ్రైవ్ చేస్తే వారిపై కేసులు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు. 100 బృందాలతో ఆకస్మిక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని వెళ్లే మార్గాలు కూడా గుర్తించామని తెలిపారు.. కమిషనరేట్ పరిధిలో 1500 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో వుంటారని వెల్లడించారు. బేగంపేట పై వంతెన మినహా మిగిలిన అన్ని వంతెనలు ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు వరకు మూసివేస్తామన్నారు. జీరో యాక్సిడెంట్ వేడుకలే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఆ మార్గాల్లో అనుమతి లేదు..
Telangana Police on New Year Events : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు విధించారు ఈరోజు రాత్రి 11గంటల నుంచి రాత్రి 2గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ రహదారులు మూసివేస్తామని ప్రకటించారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ నుంచి వచ్చే వాహనాలు ఖైరతాబాద్, రాజ్‌భవన్ రోడ్ మీదుగా మళ్లిస్తామని తెలిపారు. బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇక్బాల్ మినార్ మీదుగా లక్డీకపూల్ వైపు తరలిస్తున్నామని చెప్పారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలకు అప్పర్ ట్యాంక్ బండ్‌కు అనుమతి లేదని.. అంబేడ్కర్ విగ్రహం మీదుగా లక్డీకపూల్ వెళ్లాలని సూచించారు. మింట్ కాంపౌండ్ రోడ్డు పూర్తిగా మూసివేస్తామని పోలీసులు అన్నారు. నల్లగుట్ట రైల్వే వంతెన మీదుగా సంజీవయ్య పార్కు వైపు వచ్చే వాహనాలు కర్బాలా మైదానం వైపు, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు సెయిలింగ్ క్లబ్ వద్ద మళ్లించి కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు తరలించనున్నారు. బేగంపేట పై వంతెన మినహా అన్ని వంతెనలు మూసి వేస్తామని తెలిపిన పోలీసులు ట్రావెల్ బస్సులు, లారీలకు రాత్రి 2గంటల వరకు నగంలోకి అనుమతి ఉందన్నారు.
హ్యాపీ న్యూ ఇయర్ ఫోక్స్..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలంగాణ పోలీసులు తెలిపారు. మూడు కమిషనరేట్లలో ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ హ్యాపీగా.. జాలీగా.. న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెబుదామన్నారు. నగర ప్రజలకు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.