కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. గజేంద్ర షెకావత్ రాసిన లేఖపై ప్రత్యుత్తరమిచ్చారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామన్న ఏపీ సీఎం... ఆంధ్రప్రదేశ్ తరఫున మాట్లాడేందుకు అజెండా ఖరారు చేశామన్నారు. సమావేశానికి సంబంధించి ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న రాసిన లేఖ సరికాదని లేఖలో పేర్కొన్నారు.
కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు. 2015లో కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య అంగీకారం కుదిరిందని... కృష్ణా నదీ నీటి పంపకాల్లో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం.. ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించడం సహా సమర్థంగా కాల్వల వ్యవస్థను వినియోగించుకోవడమేనన్న సీఎం జగన్... రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదని స్పష్టం చేశారు. నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగదని లేఖలో పేర్కొన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే ఈ ఎత్తిపోతల పథకం అని వివరించారు.