PRC issue in AP: ఓ వైపు పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాల చెల్లింపునకు కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో జీతాల చెల్లింపునకు సీఎఫ్ఎంఎస్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది.
సమ్మె బాట పడతారా.?
పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం చేశారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును.. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు ఇవ్వనున్నారు.