నూతన రెవెన్యూ చట్టం అంతం కాదు... ఆరంభం మాత్రమే అని సీఎం కేసీఆర్ అన్నారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగుగా అభివర్ణించారు. నూతన రెవెన్యూ చట్టంపై సభ్యుల సలహాలు స్వీకరిస్తామన్నారు. సభ్యులు అందరూ ఉత్తమమైన సలహాలు ఇచ్చారని కితాబిచ్చారు. పలు చట్టాల సమాహారంగా రెవెన్యూ చట్టం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నూతన రెవెన్యూ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు.
అన్ని అంశాలు తొలగించడం లేదు
సమైక్య రాష్ట్రంలో 160 నుంచి 170 వరకు చట్టాలు ఉండేవి. ప్రస్తుతం తెలంగాణలో 87 చట్టాలు ఉన్నాయి. ధరణి మాత్రమే కాదు మిగతా చట్టాలు ఉంటాయి. రెవెన్యూ చట్టంలోని అన్ని అంశాలను తొలగించడం లేదు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను మాత్రమే తొలగిస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కల్గించే అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాం. గ్రామాల్లో వివాదం ఉన్నవి చాలా తక్కువ.
- సీఎం కేసీఆర్
ప్రేక్షకపాత్ర వహిస్తే నేరం అవుతుంది
57లక్షల 90వేల మంది అన్నదాతలకు రైతుబంధు అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రైతుబంధు పరిహారం ఒకరిది మరొకరికి వెళ్లిందా అనే అంశంపై విచారణ చేయించినట్లు వెల్లడించారు. ఒకరి పరిహారం ఇంకొకరికి వెళ్తే చాలా గొడవలు జరిగేవని చెప్పారు. రైతుబంధు పథకం పరిశీలిస్తే వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువని వివరించారు. భూముల వివాదాల పరిష్కారానికి సర్వేనే సరైన మార్గమని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో పాలకులు ప్రేక్షకపాత్ర వహిస్తే నేరం అవుతుందన్నారు.
ఎన్నికలు వస్తేనే
రెండు లేదా మూడు మినహా మిగిలిన చట్టాలు తీసి వేయడం లేదని సీఎం పేర్కొన్నారు. గతంలో అవలంభించిన భూ విధానం అశాస్త్రీయంగా ఉందని విమర్శించారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు... స్థలాలు చూపకుండానే పట్టాలు పంపిణీ చేశారని ఆరోపించారు. హద్దులు చూపకుండా భూముల పట్టాలు ఇచ్చారన్నారు. పంచిన భూమి తక్కువ... పంపిణీ చేసిన కాగితాలే ఎక్కువని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్ ఇదీ చదవండి:అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్ట్