తెలంగాణ

telangana

ETV Bharat / city

NEW TAX: ఏపీలో కొత్త ఆస్తి పన్ను విధానానికి ఆమోదం - ఏపీ వార్తలు

ఏపీలో అధికార పార్టీకి స్థానిక సంస్థల్లో వచ్చిన ఆధిక్యం ముందు.. కొత్త ఆస్తిపన్ను విధింపుపై ప్రజల వ్యతిరేకత చిన్నబోయింది. కొత్త పన్ను విధానానికి.. పాలకవర్గాల ఆమోదం లభించింది. ఫలితంగా.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే నూతన భారం అమల్లోకి వచ్చినట్లయింది. ప్రస్తుతం స్థానిక సంస్థలు గెజిట్ ప్రచురిస్తుండగా.. సెప్టెంబర్ 15లోగా ఇళ్లు, భవనాల వారీగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.

property tax
property tax

By

Published : Aug 27, 2021, 2:59 PM IST

ఏపీలో కొత్త ఆస్తి పన్ను విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఆందోళనలు చేసినా.. పాలకవర్గాల నిర్ణయం మారలేదు. లిఖితపూర్వకంగా పెద్దసంఖ్యలో అభ్యంతరాలు తెలిపినా.. కొత్త విధానంలోనే పన్నులు వేయాలంటూ.. సభ్యులు అనుకూల తీర్మానాలు చేసేశారు. ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష సభ్యులు విభేదించినా.. స్థానికసంస్థల్లో ఆధిక్యం కలిగిన అధికార పార్టీ సభ్యులు.. దాదాపు అన్నిచోట్లా అనుకూలంగా తీర్మానం చేశారు. ఫలితంగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే.. పట్టణ స్థానికసంస్థల్లో కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తుది నోటిఫికేషన్‌ ఇచ్చి.. జిల్లా గెజిట్‌లో ప్రచురిస్తున్నారు. ఈ ప్రక్రియను అన్నిచోట్లా నెలాఖరులోగా పూర్తిచేసి.. వచ్చేనెల 15లోగా ఇళ్లు, భవనాల వారీగా ప్రత్యేక నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.


పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో వార్షిక అద్దె విలువ ఆధారంగా.. ఆస్తిపన్ను స్థానంలో ఆస్తి మూలధన విలువపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ధరల ఆధారంగా పన్నులు వేసే కొత్త విధానాన్ని.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం.. పన్నులు భారీగా పెరుగుతాయని ప్రజలు వ్యతిరేకించారు. ప్రజాభిప్రాయ సేకరణలోనూ అభ్యంతరాలు లేవనెత్తారు. కొత్త పన్ను విధానంపై పట్టణ స్థానిక సంస్థలు జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్లపైనా.. రాష్ట్రవ్యాప్తంగా 25 వేలకుపైగా అభ్యంతరాలు నమోదయ్యాయి. అత్యధికంగా జీవీఎంసీ.. 9 వేల 297 మంది అభ్యంతరం తెలిపారు. అయితే.. దాదాపు పట్టణ స్థానిక సంస్థలన్నింటిలో... అధికార పార్టీకి ఆధిక్యం ఉన్నందువల్ల.. ప్రజల వ్యతిరేకత పక్కకుపోయింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్మానం చేయడం వల్ల.. కొత్త పన్ను వివరాలతో అధికారులు తుది నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇప్పటికే.. 40 నుంచి 45 శాతం పుర, నగరపాలక సంస్థల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసి గెజిట్‌ ప్రచురించారు.

పన్ను విధింపు వ్యవహారాలన్నీ.. గతంలో పుర, నగరపాలక సంస్థలు చూసేవి. కొత్త విధానం తెరపైకి వచ్చినప్పటి నుంచి.. పురపాలకశాఖ కమిషనర్‌ కార్యాలయం అధికారులు చూస్తున్నారు. ఇప్పటికే.. అన్నిచోట్ల నుంచి అసెస్‌మెంట్ల వివరాలు తీసుకుని.. ఇప్పుడు వాటికి కొత్త విధానం ప్రకారం పన్నులు లెక్కించి.. ప్రత్యేక తాఖీదులు రూపొందిస్తున్నారు. పురపాలకశాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి వెళ్లిన సమాచారంపై.. పట్టణ స్థానిక సంస్థల్లో అసెస్‌మెంట్ల వారీగా ప్రింట్లు తీసి.. వాటిని వార్డు సచివాలయాల్లో సిబ్బంది, వాలంటీర్లతో ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ఈ ప్రక్రియ.. సెప్టెంబరు 15లోగా పూర్తి చేయాలని పుర కమిషనర్లను అధికారులు ఆదేశించారు.

ప్రత్యేక తాఖీదుల ప్రకారం.. ప్రజలు 2021-22 సంవత్సరానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత విధానం ప్రకారం ఇప్పటికే చాలామంది మొదటి అర్ధ సంవత్సర పన్ను చెల్లించారు. వారంతా.. పెరిగిన మిగతా మొత్తానికి చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. మార్చిలోగా ఏడాది పన్ను మొత్తం ప్రజలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్లను అధికారులు ఆదేశించారు.

ఇదీ చూడండి: CM KCR REVIEW: దళిత బంధుపై ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details