తెలంగాణ

telangana

ETV Bharat / city

పోలీసులకు కొత్త మాన్యువల్‌.. న్యాయశాఖ పరిశీలన అనంతరం అమల్లోకి..

పోలీసుశాఖ పరిపాలనాపరమైన అంశాలకు కీలకమైన మ్యానువల్​ను అధికారులు సిద్ధంచేశారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వానికి పంపారు. కన్వర్షన్లు, సీనియారిటీ సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.

police manual
police manual

By

Published : Jul 8, 2022, 4:16 AM IST

పోలీసుశాఖ చిరకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ పోలీసు మాన్యువల్‌ (సూచనల పుస్తకం) సిద్ధమైంది. దాదాపు అయిదేళ్లపాటు శ్రమించి రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దిన మాన్యువల్‌ ముసాయిదాను ఇటీవల ప్రభుత్వానికి పంపారు. న్యాయశాఖ పరిశీలన అనంతరం త్వరలోనే అమల్లోకి రావచ్చని భావిస్తున్నారు. ఇందులో పలు కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుశాఖ పరిపాలనాపరమైన అంశాలకు మాన్యువలే కీలకం. సిబ్బంది పదోన్నతులు, బదిలీలు, సర్వీసు వ్యవహారాలను దిశానిర్దేశం చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించిన ఏపీ పోలీసు మాన్యువల్‌ ప్రస్తుతం అమలవుతోంది. రాష్ట్ర అవసరాలకు వీలుగా తెలంగాణకు ప్రత్యేకంగా మాన్యువల్‌ ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అయిదేళ్ల క్రితం కసరత్తు మొదలుపెట్టారు. పదవీ విరమణ చేసిన ఐజీ గంగాధర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. రాజ్యాంగానికి లోబడి, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కొత్త మాన్యువల్‌లో పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.

కన్వర్షన్ల ఎత్తివేత?
పోలీసుశాఖలో తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం (టీఎస్‌ఎస్‌పీ), సాయుధ (ఏఆర్‌), సివిల్‌ విభాగాల వారీగా నియామకాలు జరుగుతాయి. అనంతరం ప్రతిభ ఆధారంగా ఒక విభాగం నుంచి మరో విభాగంలోకి వచ్చేందుకు (కన్వర్షన్‌) అవకాశం ఉండేది. టీఎస్‌ఎస్‌పీ నుంచి ఏఆర్‌లోకి, ఏఆర్‌ నుంచి సివిల్‌లోకి పరిమిత స్థాయిలో కన్వర్షన్లు ఉండేవి. ఒక్కోసారి దీనివల్ల న్యాయపరమైన ఇబ్బందులు వచ్చేవి. ఏఆర్‌ నుంచి సివిల్‌లోకి వచ్చిన వారికి, అప్పటికే సివిల్‌ విభాగంలో ఉన్న వారికి మధ్య పదోన్నతులప్పుడు తరచూ వివాదాలు వస్తుండేవి. ఏఆర్‌ నుంచి వచ్చిన వారికి అప్పటివరకూ ఉన్న వారి సర్వీసును పరిగణనలోకి తీసుకోకూడదని, అలా చేస్తే సీనియార్టీలో తమకు అన్యాయం జరుగుతుందని సివిల్‌ విభాగం వారు వాదించేవారు. పదోన్నతులప్పుడు ప్రతిసారీ ఇలా ఏదో ఒక వివాదం తలెత్తేది. ఈ సమస్య పరిష్కారానికి కొత్త మాన్యువల్‌లో కన్వర్షన్లు ఎత్తేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అంటే ఏ విభాగంలో చేరిన వారు ఆ విభాగంలోనే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే సీనియారిటీ
శాఖలో ఉన్న మరో ప్రధాన సమస్య రేంజ్‌ల వారీగా పదోన్నతులు ఇవ్వడం. ఎస్సై ఎంపిక రేంజ్‌ల వారీగా జరుగుతుంది. అయితే పాత హైదరాబాద్‌ రేంజ్‌ పరిధిలో పోస్టులు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ పదోన్నతులు త్వరగా లభించేవి. పాత వరంగల్‌ రేంజ్‌లో పోస్టులు తక్కువగా ఉండడంతో ఆలస్యమయ్యేవి. దీనిపైనా తరచూ వివాదం నడుస్తుంటుంది. ఎస్సైలు డీఎస్పీ (రాష్ట్రస్థాయి పోస్టు) స్థాయికి వచ్చిన తర్వాత ఒకే బ్యాచ్‌కి చెందినప్పటికీ హైదరాబాద్‌ వారు ముందు పదోన్నతి పొంది తమపై పెత్తనం చేస్తున్నారని వరంగల్‌ రేంజ్‌ వారు తరచూ ఆరోపిస్తుండేవారు. తమ తర్వాత ఎంపికైన 1996 బ్యాచ్‌ వారికి డీఎస్పీలుగా ముందుగా పదోన్నతి ఇవ్వడంపై 1995 వరంగల్‌ రేంజ్‌ అధికారులు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై చాలాకాలం వివాదం నడిచింది. చివరకు రెండు బ్యాచ్‌లకూ ఒకేసారి పదోన్నతులు ఇచ్చారు. ఇందుకోసం డీఎస్పీ స్థాయిలో అవసరానికి మించి పోస్టులు సృష్టించారు. వీరందర్నీ ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఎస్సై ఎంపిక వరకూ మల్టీజోన్‌ పరిధిలో ఉంచి పదోన్నతులప్పుడు రాష్ట్రస్థాయి పోస్టుగా పరిగణించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అంటే పదోన్నతులప్పుడు రేంజ్‌ల వారీగా కాకుండా రాష్ట్రస్థాయిలో ఒకటే సీనియార్టీ జాబితా తయారవుతుంది. దీనివల్ల ఒక బ్యాచ్‌లో వారందరికీ ఖాళీలను బట్టి ఒకేసారి పదోన్నతులు ఇవ్వడానికి వీలవుతుంది. ఈ రెండు ప్రతిపాదనలు మినహా మిగతా అంశాల్లో పెద్దగా మార్పులు లేవని తెలుస్తోంది.

ఇదీ చూడండి :పండుగలొస్తున్నాయ్... వాటిపై నిఘా ఉంచండి: సీపీ ఆనంద్

ABOUT THE AUTHOR

...view details