AP New Cabinet : దూకుడు.. సీనియారిటీ.. వైకాపా ఆవిర్భావం నుంచి, అంతకంటే ముందు నుంచి వెంట నిలిచినవారు.. 2014-19 మధ్య ఎంత ఒత్తిడి వచ్చినా పార్టీని వీడని ఎమ్మెల్యేలు.. ఇలా నాలుగు విభాగాలుగా ఆశావహులను క్రోడీకరించి వారిలో కొందరిని మంత్రిమండలిలోకి తీసుకునేందుకు ఏపీ సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు వైకాపా వర్గాల్లో చర్చ సాగుతోంది. వీరే కాకుండా సామాజిక, రాజకీయ సమీకరణలో భాగంగా తీసుకునేవారూ ఉంటారని చెబుతున్నారు.
జిల్లాకు ఒకరు:మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు ఏప్రిల్ 11న ఉదయం 11.31 గంటలకు ముహూర్తం ఖరారైనట్లు అధికార పార్టీ వర్గాల కథనం. జిల్లాకు ఒక మంత్రి ప్రాతిపదికను అమలుచేసే అవకాశమున్నట్లు సమాచారం. సామాజిక, రాజకీయ సమీకరణల దృష్ట్యా దీనికి అతీతంగానూ కొందరిని తీసుకోవచ్చనే చర్చ కూడా ఉంది. అప్పుడు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంపిక చేస్తారని అంటున్నారు. సీనియారిటీపరంగా ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి వంటి నేతల పేర్లు పరిశీలనలోకి తీసుకోవచ్చని వైకాపా నేతలు అంటున్నారు. ప్రాతిపదికేంటి? ఉన్నవారిలో ఎవరిని తొలగిస్తారు? కొత్తగా ఎవరు మంత్రిమండలిలోకి వస్తారనే విషయాలపై సీఎం ఇప్పటికీ తన ఆలోచనను ఎవరి దగ్గరా బయట పెట్టలేదని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
జిల్లాల వారీగా ఆశావహులెవరు?:శ్రీకాకుళం: జిల్లా నుంచి ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు ఉండగా.. స్పీకర్ తమ్మినేని సీతారాం ఇక్కడినుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కృష్ణదాస్, అప్పలరాజులో ఒకరిని మంత్రిమండలిలో కొనసాగించవచ్చనే ప్రచారం ఉంది. అదే జరిగితే ఈ జిల్లాలో కొత్తగా ఎవరికీ మంత్రి పదవి దక్కబోదు. ఇద్దరినీ తప్పిస్తే వేరొకరికి పదవి దక్కే అవకాశముంది. తమ్మినేని సీతారాం మంత్రిమండలిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. శాసనసభాపతి పదవికి ధర్మాన కృష్ణదాస్, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావులలో ఒకరి పేరును పరిశీలిస్తున్నారన్న ప్రచారముంది. వీరిలో ఒకరికి సభాపతి స్థానం ఇస్తే తమ్మినేని పేరు మంత్రి పదవి పరిశీలనకు రావచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ మహిళలకు ప్రాధాన్యమివ్వాలనుకుంటే రెడ్డి శాంతి పేరు పరిశీలించే అవకాశం ఉంటుందని, అప్పుడు సీతారాం సభాపతిగానే కొనసాగాల్సి ఉంటుందని చెబుతున్నారు.
విజయనగరం:ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణను తప్పించే పరిస్థితి వస్తే.. కోలగట్ల వీరభద్రస్వామి, కంబాల జోగులు పేర్లు పరిశీలనకు రావొచ్చు. విజయవాడకు చెందిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ను తప్పిస్తే ఆయన సామాజికవర్గానికి చెందిన కోలగట్లకు అవకాశం రావచ్చనేది వైకాపా నేతల అంచనా. అలా కాదంటే ఎస్సీ కోటాలో జోగులుకు అవకాశం ఉండొచ్చన్న ప్రచారముంది. బొత్స కుటుంబంలోనే ఇవ్వాల్సి వస్తే అప్పలనరసయ్యకు అవకాశం ఉండొచ్చు.
మన్యం(పార్వతీపురం కేంద్రంగా):జిల్లాలో పీడిక రాజన్నదొర, విశ్వాసరాయి కళావతిలో ఎవరికో ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశముంది. మరోవైపు రాజన్నదొరను స్పీకర్‌ను చేయవచ్చన్న చర్చ కూడా ఉంది.
అల్లూరి సీతారామరాజు(పాడేరు):జిల్లాలో భాగ్యలక్ష్మి, నాగులపల్లి ధనలక్ష్మిలలో ఒకరికి మంత్రిమండలిలో స్థానం దక్కొచ్చు.
అనకాపల్లి:బీసీ కోటాలో బూడి ముత్యాలనాయుడు, కాపు కోటాలో గుడివాడ అమర్నాథ్ మధ్య పోటీ ఉంది. గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ కూడా రేసులో ఉన్నారు.
విశాఖపట్నం:అవంతి శ్రీనివాసరావు కాపు కోటాలో మంత్రిగా ఉన్నారు. బీసీకి ఇవ్వాలనుకుంటే తిప్పల నాగిరెడ్డికి అవకాశం రావచ్చు.
కాకినాడ:కాపు సామాజిక వర్గానికే చెందిన మంత్రి కన్నబాబు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాల మధ్య తీవ్ర పోటీ ఉంది. కన్నబాబును పక్కనపెడితే రాజాకే పదవి అనే ప్రచారం ఉంది.
తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం):కాపు కోటాలో జక్కంపూడి రాజా, ఎస్సీ కోటాలో తలారి వెంకట్రావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
కోనసీమ(అమలాపురం):వేణుగోపాలకృష్ణ, పినిపె విశ్వరూప్ మంత్రులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని కొనసాగించవచ్చన్న ప్రచారం ఉంది. ఇద్దరినీ తొలగిస్తే కొత్తగా ఇంకొకరికి పదవి దక్కుతుంది. జిల్లా నుంచి ఎస్సీకి ఇవ్వాలన్న ప్రతిపాదనే వస్తే కొండేటి చిట్టిబాబు పేరు పరిశీలించే అవకాశముంది. శ్రీకాకుళంలో మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజును తప్పిస్తే ఆయన సామాజికవర్గానికి చెందిన పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌కు అవకాశం ఉంటుంది.
ఏలూరు (పశ్చిమగోదావరి):ఉపముఖ్యమంత్రి ఆళ్ల నానిని పక్కన పెట్టాల్సి వస్తే.. పోటీలో ఎస్టీ కోటాలో తెల్లం బాలరాజు, ఎస్సీ కోటాలో ఎలీజా పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ కృష్ణా జిల్లాలో కొడాలి నానిని పదవి నుంచి తప్పిస్తే ఆయన సామాజికవర్గానికి చెందిన కొఠారు అబ్బయ్యచౌదరికి అవకాశం దక్కొచ్చన్న ప్రచారం ఉంది. నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు పేరునూ పరిశీలించే అవకాశముంది.
నరసాపురం:ప్రస్తుత మంత్రి శ్రీరంగనాథరాజును తొలగిస్తే అదే సామాజికవర్గానికి చెందిన ముదునూరి ప్రసాదరాజుకు అవకాశం రావచ్చనే ప్రచారముంది. ఇదే జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై నెగ్గిన, కాపు వర్గానికి చెందిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌నుంచి ప్రసాదరాజుకు గట్టి పోటీ ఉంది. బీసీ కోటాలో కారుమూరి వెంకటనాగేశ్వరరావు సైతం ఉన్నారు.
కృష్ణా:ఇక్కడి నుంచి కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా ఉన్నారు. వీరిలో ఎవరు కొనసాగినా ఇతరులకు అవకాశముండదు. ఇద్దరిని తొలగిస్తే.. సామాజిక సమీకరణల కోణంలో కొలుసు పార్థసారథి, జోగి రమేష్ పోటీలో ఉన్నారు.
ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ):ఇక్కడ వెలంపల్లి శ్రీనివాసరావును తొలగించాల్సి వస్తే ఆ స్థానంలో ఎస్సీ కోటాలో కొక్కిలిగడ్డ రక్షణనిధి పేరు పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. కాపు కోటాలో సామినేని ఉదయభాను, బ్రాహ్మణ కోటాలో మల్లాది విష్ణు పోటీ పడుతున్నారు.
గుంటూరు:జిల్లా నుంచి ప్రస్తుతం ఎస్సీ కోటాలో మేకతోటి సుచరిత హోంమంత్రిగా ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆశావహుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. మైనారిటీలకు ఇస్తే మహమ్మద్ ముస్తఫాషేక్‌కు అవకాశం రావచ్చు.
పల్నాడు(నరసరావుపేట): మంత్రి పదవులకు భారీగా పోటీ ఉన్న జిల్లాల్లో ఇదొకటి. ప్రస్తుత మంత్రివర్గంలో ఇక్కడి నుంచి ఎవరూ లేరు. వైకాపాలో మొదటినుంచీ ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు పోటీ పడుతున్నారు. మహిళా కోటాలో విడదల రజని ప్రయత్నాల్లో ఉన్నారు.
బాపట్ల:జిల్లా నుంచి కోన రఘుపతి ఉపసభాపతిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశమిస్తామని సీఎం జగన్ అప్పట్లో రఘుపతికి హామీనిచ్చారని పార్టీలో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయనకు అవకాశం వస్తుందా? లేదా ఎస్సీ కోటాలో మేరుగ నాగార్జునకు దక్కుతుందా? తేలాల్సి ఉంది. నాగార్జునకు పదవిస్తే రఘుపతిని ఉపసభాపతిగా కొనసాగించే అవకాశముంది.
ప్రకాశం:జిల్లా నుంచి ప్రస్తుతమున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌లలో ఎవరిని కొనసాగించినా కొత్తవారికి అవకాశం లేనట్లే. ఈ ఇద్దరినీ తప్పిస్తే... కాపు కోటాలో మద్దిశెట్టి వేణుగోపాల్, ఎస్సీ కోటాలో టీజేఆర్ సుధాకర్‌బాబు పేర్లు వినిపిస్తున్నాయి.
నెల్లూరు:జిల్లా నుంచి మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్ మంత్రిగా ఉన్నారు. మరో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూశారు. ఇప్పుడు అనిల్‌ను తొలగిస్తేనే మరొకరికి అవకాశం వస్తుంది. ఆశావహుల్లో ప్రస్తుతానికి కాకాని గోవర్ధన్‌రెడ్డి పేరు ముందు వరుసలో ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. అదే స్థాయిలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. మానుగుంట మహీధర్‌రెడ్డి పేరూ ప్రచారంలో ఉంది.
కర్నూలు:గుమ్మనూరు జయరాం మంత్రిగా కొనసాగేందుకు కుల సమీకరణ ఉపయోగపడుతుందన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయన్ను తొలగిస్తే రేసులో సాయిప్రసాదరెడ్డి/బాలనాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఉన్నారు. కాటసాని ఇప్పటికే తితిదే బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయినందున ఆయన్ను మంత్రిమండలిలోకి తీసుకుంటారా? లేదా పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్న కుటుంబం తమదంటున్న సాయిప్రసాదరెడ్డి.. ఆయన సోదరుడు బాలనాగిరెడ్డిల్లో ఒకరికి అవకాశం దక్కుతుందా అనేది చూడాలి. మహిళా కోటాలో కంగాటి శ్రీదేవి పేరు తెరపైకి వచ్చే అవకాశముందన్న చర్చ ఉంది. ముస్లిం కోటాలో హఫీజ్‌ఖాన్ గట్టి పోటీనే ఇస్తున్నారు.
నంద్యాల:ప్రస్తుత జిల్లా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించే పరిస్థితే వస్తే శిల్పాచక్రపాణిరెడ్డి, లేదా ఎస్సీ కోటాలో ఆర్థర్ పేర్లు పరిశీలనకు రావచ్చంటున్నారు.
అనంతపురం:జిల్లాలో మంత్రి లేనందున పోటీ గట్టిగానే ఉంది. మహిళల్లో బీసీ కోటాలో ఉషశ్రీచరణ్, ఎస్సీ కోటాలో జొన్నలగడ్డ పద్మావతి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీలో మొదటినుంచీ ఉన్నానని, బీసీనని కాపు రామచంద్రారెడ్డి కూడా గట్టిగానే ఆశిస్తున్నారు. వచ్చేది ఎన్నికల బృందం (కొత్త కేబినెట్) అంటున్నారు కాబట్టి సీనియర్లకే ఓటేసే పరిస్థితి వస్తే అనంత వెంకటరామిరెడ్డికి అవకాశం దక్కొచ్చన్న చర్చా ఉంది.
శ్రీసత్యసాయి:జిల్లాలో మాలగుండ్ల శంకరనారాయణ మంత్రిగా ఉన్నారు. ఆయన్ను తొలగించాల్సి వస్తే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిలలో ఒకరిని.. లేదా ఎం.తిప్పేస్వామిని పరిశీలించొచ్చని చర్చ జరుగుతోంది.
కడప:ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లానుంచే ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా మంత్రిమండలిలో ఉన్నారు. జిల్లాలో ఒకరికే పదవి నిబంధన పాటిస్తే అంజద్‌బాషాను తొలగించడంతోపాటు కొత్తగా ఎవరికీ అవకాశం లేకపోవచ్చు. అయితే కొత్తగా ఎన్నికైన డాక్టర్ సుధ పేరు పరిశీలనలో ఉందని, ఆమెకు విప్ పదవిని ఇస్తారనే ప్రచారమూ ఉంది.
అన్నమయ్య:కొరుముట్ల శ్రీనివాసులు పేరు ప్రచారంలో ఉంది. సామాజిక సమీకరణల దృష్ట్యా గడికోట శ్రీకాంత్‌రెడ్డికి అవకాశం ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశమే. సీఎం హామీ పొందిన మేడా మల్లికార్జునరెడ్డి ఇదే జిల్లాకు చెందినవారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి పదవిని వదులుకుంటే పార్టీకి పెద్ద దిక్కయిన ఆయన కుటుంబంలో వారికే మళ్లీ అవకాశమిచ్చే పరిస్థితి వస్తే.. పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి పేరు తెరపైకి రావచ్చు.
శ్రీబాలాజీ(తిరుపతి):జిల్లా నుంచి మంత్రులు ప్రస్తుతం లేనందున కచ్చితంగా ఒకరికి అవకాశం దక్కనుంది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
చిత్తూరు:పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మంత్రిమండలిలో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరిని కొనసాగించినా ఇతరులకు మంత్రిపదవి గురించిన చర్చ ఉండదు. ఇద్దరినీ తొలగిస్తే మహిళా కోటాలో ఆర్‌కే రోజా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కాపు కోటాలో జంగాలపల్లి శ్రీనివాసులు ప్రయత్నాల్లో ఉన్నారు.