New Medical Colleges in Telangana : రాష్ట్రంలో ఎనిమిది కొత్త వైద్యకళాశాలల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. 2022-23 వైద్య విద్య సంవత్సరం నుంచి వీటిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినా పనులు మాత్రం వేగంగా సాగడం లేదు. వైద్య కళాశాల మంజూరవ్వాలంటే అనుబంధ ఆసుపత్రిలో కనీసం 330 పడకలు ఉండాలి. కొత్తగా మంజూరు చేసిన వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రుల్లో.. ఒక్క సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మినహా ఎక్కడా అన్ని పడకలు లేవు. అందుకే మిగిలిన 7 జిల్లాల్లో వీటి సంఖ్యను పెంచేందుకు తాత్కాలిక ప్రాతిపదికన నిర్మాణాలను చేపట్టారు. కానీ ఎక్కడా ఆశించిన రీతిలో పనులు జరగడం లేదు.
Telangana Medical Colleges : జగిత్యాల, మంచిర్యాల, వనపర్తి జిల్లాల్లోని అనుబంధ ఆసుపత్రుల్లో కొంత పురోగతి కనిపిస్తున్నా.. రామగుండం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం ఆసుపత్రుల పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక 8 కొత్త వైద్యకళాశాలల నిర్మాణాలైతే మరీ మందగమనంతో సాగుతున్నాయి. జాతీయ వైద్య కమిషన్ తనిఖీ బృందం తొలివిడత పరిశీలనకు వచ్చి వెళ్లింది. అన్నిచోట్ల అసంపూర్తి నిర్మాణాలు ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ బృందం మరోసారి తనిఖీలకు వచ్చే అవకాశాలున్నాయి. ఈలోగా నిర్మాణాలు పూర్తి కాకపోతే.. 2022-23 సంవత్సరానికి వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళన వైద్యవర్గాల్లో నెలకొంది.
పైకప్పు వేయనివే అధికం
Telangana New Medical Colleges Construction : జాతీయ వైద్య కమిషన్ తనిఖీలను దృష్టిలో పెట్టుకొని వైద్యఆరోగ్యశాఖ కొత్తగా ప్రారంభించనున్న 8 కళాశాలల్లోనూ అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని నియమించింది. ఇటీవల ఎన్‌ఎంసీ బృందం తనిఖీలకు వచ్చినప్పుడు బోధన సిబ్బంది అందుబాటులో ఉండడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ప్రధానంగా ఆసుపత్రిలో 330 పడకలు లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదనపు పడకల కోసం ఆసుపత్రుల్లో చేపట్టిన నిర్మాణాల్లో ఇప్పటికీ పైకప్పు కూడా పూర్తి కానివే అధికంగా ఉండడం గమనార్హం. అన్నిచోట్లా తాత్కాలిక ప్రాతిపదికన ఇనుప రాడ్లతో అదనపు నిర్మాణాలు చేపట్టారు. వీటిన్నింటిలోనూ సాధ్యమైనంత వేగంగా ఆసుపత్రి రూపురేఖలు తీసుకురావడం ఇప్పుడున్న అతి పెద్ద సవాల్. ఎన్‌ఎంసీ సిబ్బందిని ముందుగా ఆసుపత్రి విషయంలో సంతృప్తిపర్చగలిగితే.. తర్వాత వైద్య కళాశాల భవన నిర్మాణానికి మరికొంత సమయం కోరవచ్చని వైద్యశాఖ భావిస్తోంది. వచ్చే 6-8 వారాల్లో తనిఖీ బృందం మరోసారి పరిశీలనకు వచ్చే అవకాశాలుండడంతో.. ఈలోగా కనీసం అదనపు పడకల నిర్మాణాన్నైనా పూర్తి చేస్తే ఫలితముంటుందని యోచిస్తోంది. ఇక వైద్యకళాశాలలను తాత్కాలిక ప్రాతిపదికన రెండంతస్తులైనా నిర్మిస్తే.. తొలి సంవత్సరం విద్యార్థులకు ముందుగా తరగతులు ప్రారంభించడానికి అవకాశముంటుందని వైద్యశాఖ భావిస్తోంది. అందుకే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఇదే విషయంపై పలుమార్లు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. ‘ఈనాడు’ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు అరకొర నిర్మాణాలే కనిపించాయి.
తుది రూపు ఎప్పటికో..
Telangana medical colleges news : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైద్య కళాశాల నిర్మాణ పనులకు ఇప్పటికే మూడుసార్లు గడువు ముగిసినా నిర్మాణం పూర్తికాలేదు. కొత్తగూడెం ఆసుపత్రికి అదనంగా నిర్మిస్తున్న భవనాలు పనులు 50 శాతమే పూర్తయ్యాయి. తాత్కాలిక వైద్యకళాశాల నిర్మాణమైతే కేవలం 40 శాతమే పూర్తయింది.
మందకొడిగా పనులు
New medical colleges in telangana updates : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం కేటాయించిన భూమిలో వివాదాల కారణంగా 3 నెలలు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత న్యాయస్థానం అదేశాల మేరకు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. నేటి వరకూ 20 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇక మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు నిర్మాణాలు 50 శాతమే పూర్తయ్యాయి.
ఇతర శాఖల భవనాలతో..
telangana new medical colleges updates : జగిత్యాలకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా చేపట్టిన 200 పడకల మాతాశిశు కేంద్రం నిర్మాణం పూర్తి కాగా.. రూ.610 కోట్లతో చేపట్టిన అదనపు పడకల పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రహదారి భవనాలశాఖ కల్యాణమండపం, విశ్రాంతిభవనం, వేర్‌హౌజింగ్, మార్క్‌ఫెడ్ గోదాములు, ఆగ్రోస్ కార్యాలయం వంటి వాటిని ఆసుపత్రికి అనువుగా మార్చుతున్నారు.