తెలంగాణ రాష్ట్రంలో విక్రయాలకు సంబంధం లేకుండానే మద్యం విధానంలో తెచ్చిన మార్పులు, చేర్పుల కారణంగా రూ.1,467 కోట్లు రాబడి ప్రభుత్వానికి చేకూరింది. 2019-21 సంవత్సరాలకు చెంది అబ్కారీ శాఖ నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. ఇందులో గతంలో ఉన్న నాలుగు స్లాబులను ఆరు శ్లాబులుగా విస్తరించింది. బీరుపై ఇప్పటి వరకు లైసెన్స్‌దారులకు 25శాతం మార్జిన్ ఇచ్చేది... కాని దానిని 20శాతానికి తగ్గించడం ద్వారా ఏడాదికి రూ.200 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని అబ్కారీ శాఖ అంచానా వేసింది.
రీటేల్ ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా వచ్చిన రాబడి రూ.111 కోట్లు
ఇక ప్రతి దుకాణదారుడి నుంచి ప్రత్యేక రీటేల్ ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా రూ.111 కోట్లు, గతంలో ఉన్న నాలుగు శ్లాబులను ఆరు శ్లాబులకు పెంచడం ద్వారా రూ.152 కోట్లు అదనంగా వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. లైసెన్స్‌లు ఎక్సైజ్ ట్యాక్స్ విలువకు ఏడు రెట్లు మించి మద్యం అమ్మినట్లయితే అదనంగా జరిగిన విక్రయాలపై విధించే టర్నోవర్ ట్యాక్స్ కింద మరో రూ.28 కోట్లు వరకు వస్తుందని భావిస్తున్నారు.
ఒక్క దరఖాస్తుకు రెండు లక్షలు వసూలు
వెనక్కి తిరిగి ఇవ్వని ఫీజు కింద దరఖాస్తుకు రెండు లక్షల లెక్కన వసూలు చేయడం వల్ల 2216 దుకాణాల ఏర్పాటుకు 48,784 దరఖాస్తులు రావడం... దాని ద్వారా రూ.975.68 కోట్లు వచ్చినట్లు అబ్కారీ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ వివరించారు.