రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మందికిపైగా సహాయ సిబ్బందిని నియమించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒప్పంద పద్ధతిలో లేదా టీఎస్‌పీఎస్సీ ద్వారా నియమించనున్నారు. ‘కొత్త సిబ్బంది నియామకానికి సీఎం కూడా సానుకూలత వ్యక్తం చేశారు. వీఆర్వోల స్థానంలో జూనియర్ గిర్దావర్‌లను తీసుకుందామని సీఎం తెలిపారు. వీఆర్వో, వీఆర్‌ఏల నుంచి అర్హుల సర్దుబాటు తరువాత కొద్ది రోజుల్లో దీనికి సబంధించిన ప్రక్రియ ప్రారంభించే అవకాశాలున్నాయి’ అని రెవెన్యూశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు... కసరత్తు ప్రారంభించిన అధికారులు... - jobs news
కొత్త రెవెన్యూ చట్టంతో తహసీల్దారు కార్యాలయాల్లో సేవల సంఖ్య పెరగనుంది. మరో పక్క ధరణి పోర్టల్ రాకతో అంతా డిజిటల్ భూదస్త్రాలే. రెవెన్యూ శాఖ కొత్త రూపు సంతరించుకున్న నేపథ్యంలో ఆమేరకు సిబ్బంది కూడా పెరగాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే మండలానికి పది మంది వరకు ఉన్న వీఆర్వో వ్యవస్థ రద్దయిపోయింది. తక్షణ అవసరాలకు మండలానికి కనీసం నలుగురైనా కొత్త సిబ్బంది అవసరం. దీంతో జూనియర్ అసిస్టెంట్లు లేదా జూనియర్ ఆర్‌ఐల నియామకం చేపట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం సమాయత్తమౌతుంది.

వారసత్వ బదిలీ ప్రక్రియను (ఫౌతీ) సులభతరం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా పాసుపుస్తకాల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61.13 లక్షల వ్యవసాయ ఖాతాలున్నాయి. ఈ ఖాతాలకు చెందిన భూ యజమానుల పాసుపుస్తకాల్లో ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాల్సి ఉంది. కొత్త పోర్టల్ ధరణిలో ఈ సమాచారం నమోదు చేసి ఆ వివరాలు పాసుపుస్తకంలో అంతర్జాల సహాయంతో ముద్రించనున్నారు.
తహసీల్దారు కార్యాలయాల్లో కుటుంబసభ్యుల వివరాలను యంత్రాంగం నమోదు చేయనుంది. దీనికోసం భూ యజమానులను కార్యాలయాలకు పిలుస్తారా లేదంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేలా ఐచ్చికం తీసుకొస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదిఏమైనా వివరాలు తెలుసుకునేందుకు, పాసుపుస్తకంలో పేర్లు నిక్షిప్తం చేసుకునేందుకు భూ యజమానులు కార్యాలయాల ముందు బారులుతీరక తప్పదని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.