ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ గత ఆరేళ్లలోనే గణనీయంగా పెరిగింది. దీనికి అనుగుణంగా వచ్చే రెండు దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన టెర్మినల్‌ను నిర్మించనున్నారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనంలో.. 6 ఏరో బ్రిడ్జిలు, 24 చెక్ ఇన్ కౌంటర్లు, 14 ఇమ్మిగ్రేషన్, 4 కస్టమ్స్ కౌంటర్లు, డిపార్చర్... అరైవల్ బ్లాకుల్లో బ్యాగేజీ కన్వేయర్లు, అంతర్జాతీయ స్థాయి బ్యాగేజీ హ్యాండలింగ్ వ్యవస్థ ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు సెంట్రల్ ఏసీ, సీసీ టీవీ పర్యవేక్షణ, భద్రతా వ్యవస్థ వంటి అధునాతన సౌకర్యాలు ఉంటాయి.
ఏపీ: గన్నవరం విమానాశ్రయానికి నూతన శోభ - Integrated Terminal Building at gannavaram
ఏపీలోని గన్నవరం విమానాశ్రయంలో.. పూర్తిస్థాయి అంతర్జాతీయ సౌకర్యాలు సంతరించుకోబోతున్నాయి. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న అధునాతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం కల నెరవేరబోతోంది. గుత్తేదారు సంస్థకు తాజాగా పనులు అప్పగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం.. విమానాశ్రయంలో దేశీయ, అంతర్జాతీయ సేవలకు వేర్వేరుగా టెర్మినల్ భవనాలున్నాయి. ఈ రెండు కలిపినా.. కొత్తగా నిర్మించబోయే భవనంలో సగం కూడా ఉండవు. అంత పెద్దగా దీనిని నిర్మిస్తున్నారు. ఒకేసారి 400 మంది విదేశీ, 800 మంది దేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఇందులో సౌకర్యాలుంటాయి. రన్‌వేకు, ఆప్రాన్‌కు, టెర్మినల్‌కు మధ్య దూరం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం విమానం దిగిన తర్వాత ప్రయాణికులను బస్సుల్లో టెర్మినల్ భవనం వద్దకు తీసుకొస్తున్నారు. కొత్తగా నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం అందుబాటులోకి వస్తే.. విమానం నేరుగా రన్‌వే పైనుంచి ఆప్రాన్ పైకి చేరుకుంటుంది. దానికి ఆనుకుని ఉండే ఏరో బ్రిడ్జ్‌ల మీదుగా నడుచుకుని టెర్మినల్ వద్దకు వచ్చే వెసులుబాటు ఉంటుంది. అధునాతన హంగులతో రూపుదిద్దుకోబోతున్న ఈ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.