కేఎఫ్‌సీ బకెట్... అంటూ చికెన్ ముక్కలను ఓ డబ్బాలో వేసివ్వడం తెలిసిందే. ఈ తరహాలోనే ఈమధ్య సమోసా బకెట్‌లు ప్రాచుర్యం పొంది... అందరికీ నోరూరిస్తున్నాయి. ఈ కొత్త ట్రెండ్ సృష్టికర్త బెంగళూరు, గురుగ్రామ్‌లో ఉన్న ‘సమోసా పార్టీ’ రెస్టరెంట్. ‘సమోసాని ఇష్టపడని భారతీయులు ఉండరు. యువతకేమో ప్రతి సంతోషమూ స్నేహితులతో చిన్నసైజు పార్టీ చేసుకునేందుకు కారణమే. అలాంటి సమయాల్లో సమోసా బకెట్‌ని టేబుల్ మధ్యలో పెడితే వాటిని తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఇష్టంగా టైమ్‌పాస్ చేస్తారు. అందుకే, మా ‘సమోసా పార్టీ బకెట్’ బాగా క్లిక్ అయింది’ అంటారు దీని నిర్వాహకులు. ఆలూ, పనీర్, నూడుల్స్, చికెన్, ఎగ్, మటన్... ఇలా వేరు వేరు స్టఫింగ్స్‌తో పదకొండు రుచుల్లో మినీ సమోసాలను తయారుచేస్తుంది ఈ రెస్టరెంట్. ఇవి ఒక్కో బకెట్‌లో యాభైవరకూ పడతాయి. అన్నట్లూ ‘ఆలూ, పనీర్, చికెన్’... ఇలా వాటి రుచులను తెలిపే కోడ్‌లు కూడా ఈ సమోసాలపైన ఉంటాయట.
పాస్తాతో చిప్స్...
కరోనాతో జనానికి బోలెడంత ఖాళీ దొరికింది. బయటికెళ్లి తినడమూ తగ్గింది. దాంతో ఆహారప్రియులు ఏవేవో ప్రయోగాలు చేసి, కొత్త కొత్త వంటకాలను తయారుచేసి సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు. వాటిలో ఎక్కువమందికి నచ్చినవి కొత్త ఫుడ్ ట్రెండ్‌గా మారిపోతున్నాయి. అలాంటివే ఈ పాస్తా చిప్స్. ‘ఉడికించిన పాస్తాలో చీజ్, ఆలివ్ నూనె కలిపి ఎయిర్ ఫ్రైయర్‌లో వేయించిన వీటిని స్నాక్స్‌లా తినొచ్చు’ అంటూ ఓ టిక్‌టాకర్ పోస్ట్ చేసింది. అప్పట్నుంచీ ఇవి తెగ వైరల్ అవ్వడమే కాదు, ఎవరికి తోచినట్లూ వాళ్లు వీటిలో కొత్త పద్ధతుల్నీ సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.