తెలంగాణ

telangana

By

Published : Apr 8, 2021, 9:07 AM IST

ETV Bharat / city

శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుల నియామకం

తిరుమల శ్రీవారి ఆలయంలో నూతనంగా ప్రధాన అర్చకులు నియమితులయ్యారు. నలుగురు అర్చకులను నియమిస్తూ తితిదే ఉత్తర్వులు జారీ చేసింది. మిరాశీ కుటుంబాలకు చెందిన అర్చకులలో అనుభవం ఆధారంగా ప్రస్తుతం పదోన్నతి కల్పించారు.

Appointment of ttd, ap tirumala news
శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుల నియామకం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కైంకర్యాలు నిర్వహించే నాలుగు మిరాశీ కుటుంబాల్లోని నలుగురిని ముఖ్య అర్చకులుగా నియమిస్తూ తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఆలయంలో కైంకర్యాలను తరతరాలుగా నిర్వహించే నాలుగు మిరాశీ కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ప్రధానార్చకులు, అర్చకుల హోదాలో తితిదే నియామకాలను చేపట్టేది. వీరితోపాటు ఈ కుటుంబాలకు చెందని వారు కైంకర్యపరులుగా ఆలయంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం తితిదే అర్చక వ్యవస్థలో ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకుల పోస్టులుగా (మూడు రకాల పోస్టులు) విభజించింది.

మిరాశీ కుటుంబాలకు చెందిన అర్చకులలో అనుభవం ఆధారంగా ప్రస్తుతం పదోన్నతి కల్పించారు. అందులో భాగంగా మిరాశీ అర్చక కుటుంబాలైన గొల్లపల్లి కుటుంబం నుంచి ఎ.గోపినాథ్‌ దీక్షితులు, పైడిపల్లి కుటుంబం నుంచి రాజేశ్‌ దీక్షితులు, పెద్దింటి కుటుంబం నుంచి రవిచంద్ర దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి నారాయణ దీక్షితులను ముఖ్య అర్చకులుగా నియమితులయ్యారు. వీరితోపాటు తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో మూడు ముఖ్య అర్చక పోస్టులను తితిదే ప్రకటించింది.

ఇదీ చదవండి:ఉపకార వేతనాల్లో ఆలస్యం.. బోధన రుసుములూ పెండింగ్‌లోనే..

ABOUT THE AUTHOR

...view details