తెలంగాణ

telangana

ETV Bharat / city

నెలాఖరు వస్తోన్నా క్షేత్రస్థాయికి చేరని ఆసరా పింఛను కార్డులు

New Aasara pension cards in Telangana కొత్తగా మంజూరైన 9.5 లక్షల ఆసరా లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా పింఛను ధ్రువీకరణ పత్రాలు, కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నా, ఆ లక్ష్యం నెరవేరేలా లేదు. ఇప్పటివరకు సుమారు 10 నుంచి 15 శాతం కార్డులు మాత్రమే క్షేత్రస్థాయికి చేరడం ఇందుకు నిదర్శనం. మరోవైపు లబ్ధిదారుల జాబితాను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించకపోవడంతో వారంతా తమకు మంజూరైందో, లేదో అనే ఆందోళనతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

By

Published : Aug 27, 2022, 9:50 AM IST

New Aasara pension cards in Telangana
New Aasara pension cards in Telangana

New Aasara pension cards in Telangana: రాష్ట్ర ప్రభుత్వం 57 ఏళ్లు దాటిన వృద్ధులతోపాటు వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, ఇతర అసహాయ వర్గాలకు ఈ నెల 15న పింఛన్లు మంజూరు చేసింది. వారందరికీ ఆగస్టు నుంచే సంబంధిత సొమ్ము జమచేస్తామని సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యేలు లేదా స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కార్డులు, పింఛను మంజూరు పత్రాలు ఇవ్వాలని సూచించారు. అయితే ఇప్పటివరకూ సంబంధిత కార్డులు అందకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.

Telangana News : కొన్ని గ్రామాలకు ఒక్క కార్డూ చేరలేదు. కొన్ని మండలాలకు మంజూరైన సంఖ్యతో పోల్చితే చాలా తక్కువే అందాయి. ‘మా మండలంలో 350 మందికి పింఛన్లు మంజూరైతే కేవలం 80 కార్డులే అందాయి. దీంతో మిగిలినవారు తమకు పింఛన్లు మంజూరయ్యాయా? లేదా? స్పష్టంచేయాలని పంచాయతీ కార్యదర్శుల్ని నిలదీస్తున్నారు’’ అని కరీంనగర్‌ జిల్లాలోని ఓ మండల అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఎంపీడీవోలు గ్రామాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను పేర్కొన్నారు. కార్డులు మాత్రం ఇప్పటికీ అందలేదు. పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లాస్థాయి అధికారులు ఎమ్మెల్యేలు, మంత్రుల అపాయింట్‌మెంట్లు తీసుకుని..రెండు, మూడు గ్రామాలకు కలిపి ఇప్పటివరకు అందిన కార్డులు, పత్రాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లుచేస్తుండటం గమనార్హం.

వసూళ్లకు పాల్పడుతున్న దళారులు..:అపరిష్కృత దరఖాస్తులు 3.3 లక్షలు, కొత్తగా దరఖాస్తు చేసిన 8 లక్షల మందితో కలిపి దాదాపు 11.3 లక్షల మంది ఆశావహులు ఉన్నారు. వడపోత అనంతరం 9.5 లక్షల మందికి పింఛను మంజూరైంది. లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్లో పొందుపరిచే అవకాశమున్నప్పటికీ గ్రామీణాభివృద్ధిశాఖ ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. ఆసరా పింఛన్ల వెబ్‌సైట్లో ఇప్పటికీ లబ్ధిదారుల వివరాలు కనిపించడం లేదు. గ్రామాల వారీగా ఎంత మందికి మంజూరయ్యాయనే విషయమై సంఖ్యను ఎంపీడీవోలు ప్రకటిస్తున్నా, పట్టణాలు, నగరాల్లో ఆ తరహా కనీస సమాచారమూ లేదు. దీంతో లబ్ధిదారులు తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా కొందరు దళారులు పింఛన్లు, ఆసరా కార్డులు ఇప్పిస్తామంటూ లబ్ధిదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details