వారిద్దరూ తెలుగు యువకులు. తాము పని చేస్తున్న సంస్థ తరఫున 18 ఏళ్ల క్రితం అఫ్గానిస్థాన్‌లో రోడ్లు వేసే పనుల్లో కుదిరారు. అనూహ్యంగా తాలిబన్లకు చిక్కారు. మరణం అంచుల దాకా వెళ్లి అదృష్టవశాత్తు బయటపడ్డారు. వారే.. ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరుకు చెందిన గోని వరదారావు(వరదయ్య), ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం వాసి పెమ్మసాని మురళీనాయుడు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ దేశం పూర్తిగా మరోసారి తాలిబన్ల వశమైన నేపథ్యంలో వారిద్దరూ నాటి భయానక పరిస్థితులను 'ఈనాడు-ఈటీవీ భారత్'తో పంచుకున్నారు. పూర్తి వివరాలు వారి మాటల్లోనే...
‘మేం పనిచేస్తున్న సంస్థ తరఫున అఫ్గానిస్థాన్‌లో 2003లో రోడ్లు వేసే బృందంలో నేను(వరదారావు), వాటి నాణ్యతను పరిశీలించే బృందంలో మురళీనాయుడు పనికి కుదిరాం. కాబుల్ నుంచి కాందహార్ వరకు చేపట్టిన రోడ్డు పనుల్లో పాల్గొంటూ... కల్‌సజ్జా సిటీలో అమెరికా సైనికుల రక్షణలోని మా సంస్థ శిబిరంలో ఉండేవాళ్లం. 2003, డిసెంబరు 6న మా అమ్మానాన్నలతో ఫోన్‌లో మాట్లాడటానికి నేను కల్‌సజ్జాలోని ఓ టెలిఫోన్ బూత్‌కు వెళ్తూ.. మురళీనాయుడిని కలిశా. అదే సమయంలో రోడ్డు నాణ్యతా నిర్ధారణకు నమూనాలు తీయాల్సి రావడంతో... ఇద్దరం ఒకే వాహనంలో బయల్దేరాô. తిరిగొస్తుండగా వెనుతిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఏడుగురు తాలిబన్లు వాహనాన్ని అడ్డగించారు. మా కళ్లకు గంతలుకట్టి బందీలుగా మార్చారు. వాస్తవానికి రోడ్డు నాణ్యత విభాగాధిపతి అయిన అమెరికా అధికారిని బందీగా పట్టుకోవాల్సి ఉండగా... వారి పథకం విఫలమై మమ్మల్ని పట్టుకున్నారు.
మైనస్ 16 డిగ్రీల చలిలో ప్రయాణం
తాలిబన్లు మమ్మల్ని వాహనంలో ఎక్కించుకొని మైనస్ 16 డిగ్రీల చలిలో నాలుగు గంటలపాటు ప్రయాణించి పెద్ద కొండల సమీపంలోని భూగర్భ స్థావరానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాకిస్థాన్‌లోని రావల్పిండికి దగ్గర్లో ఉన్న రహస్య ప్రదేశానికి చేర్చారు. మార్గమధ్యంలో వాగులు దాటాల్సినప్పుడల్లా మమ్మల్ని భుజాలపై ఎక్కించుకున్నారు. వారి స్థావరానికి చేరాక, మేం తాలిబన్లకు చిక్కినట్లు ఆంగ్లంలో ఉత్తరం రాయించి సమాచార సాధనాలకు అందించడంతో... విషయం ప్రపంచానికి తెలిసింది.