తెలంగాణ

telangana

ETV Bharat / city

చివరి నిమిషంలో ఆస్పత్రికి.. ఊపిరాడక ప్రాణాలు బలి - negligence in undergoing corona test

కొవిడ్‌ బారిన పడి చివరి దశలో ఆస్పత్రుల్లో చేరుతున్న అనేకమంది రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాతోపాటు ఇతరత్రా వ్యాధులున్న చాలామంది గత రెండు రోజులుగా మృత్యువాత పడ్డారు. చాలామంది ఆక్సిజన్‌ శాతం తగ్గిన తరువాతే ఆస్పత్రులకు రావడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు.

negligence causes death, corona deaths, telangana corona cases
నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి, కరోనా మరణాలు, తెలంగాణలో కరోనా వ్యాప్తి

By

Published : Apr 24, 2021, 11:28 AM IST

Updated : Apr 24, 2021, 12:30 PM IST

చాలామంది ప్రజలు వారం, పది రోజులపాటు కరోనా లక్షణాలతో బాధపడుతున్నా పరీక్ష చేయించుకోవడం లేదు. కొంతమంది ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిన సమయంలోనో.. లేదా ఇతరత్రా లక్షణాలు తీవ్రమైన తరువాతో పరీక్ష చేయించుకుంటున్నారు. అప్పటికే ఊపిరితిత్తుల పని మందగిస్తోంది. మరికొంతమంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. కనీసం పల్స్‌మీటరుతో ఆక్సిజన్‌ శాతం చెక్‌ చేసుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అనేకమంది ఆస్పత్రిలో చేరకుండానే మరణిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కూడా కొంత తోడైంది. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుంటే మూడు రోజులకు గానీ ఫలితం రావడం లేదు. ఈ మూడు రోజులు సంబంధిత అనుమానితులు కుటుంబంతో కలిసి ఉంటున్నారు. మందులు వేసుకోకపోవడం కూడా ఇబ్బందిగా మారింది.

చివరి నిమిషంలో రావడం వల్లే :

తమ ఆస్పత్రికి వచ్చే 75 శాతం మంది రోగులు ప్రైవేటు ఆస్పత్రి నుంచే వస్తున్నారు. చివరి దశలో వస్తున్నారు. అటువంటి వారికి ఎంతగా వైద్యం అందిస్తున్నా కోలుకోవడం లేదు. అనేకమంది కొవిడ్‌ సోకినా వెంటనే పరీక్షలు చేయించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో సాధారణ వైద్యం సైతం అందకపోవడం వల్ల వ్యాధి ముదిరి మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యం పొందాలి.

- డా.రాజారావు, గాంధీ సూపరింటెండెంట్‌

ప్లాస్మా ఒక యూనిట్‌ రూ.20 వేల పైమాటే!

వరంగల్‌లో పని చేస్తున్న 40 ఏళ్ల వ్యక్తికి కొవిడ్‌ సోకడంతో అక్కడి ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో గురువారం రాత్రి మియాపూర్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు రోగిని పరీక్షించి వెంటనే ప్లాస్మా ఎక్కించాలని శుక్రవారం తెలిపారు. తమ దగ్గర అందుబాటులో లేదు.. ఎర్రగడ్డలోని ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్‌లో ఉంటుందని తీసుకురమ్మని చెప్పారు. దీంతో అతని బంధువులు అక్కడికి పరుగులు తీస్తే బ్లడ్‌ గ్రూపును బట్టి రేటు నిర్ణయించారు. రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు రేటు నిర్ణయించారు. తప్పనిసరై రూ.18 వేలు ఇచ్చి ప్లాస్మా తెచ్చి ఇస్తే మరో బాటిల్‌ ఎక్కించాలని అన్నారు. దీనికోసం మళ్లీ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Last Updated : Apr 24, 2021, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details