తెలంగాణ

telangana

ETV Bharat / city

Hyd Floods: నాలాల పూడికతీతల్లో నిర్లక్ష్యం.. ఫలితమే వరదల బీభత్సం - నాలాల పూడికతీతల్లో నిర్లక్ష్యం.. ఫలితమే వరదల బీభత్సం

రాజధాని పరిధిలో నాలాల పూడికతీతలో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. వర్షాకాలానికి ముందు తూతూమంత్రంగా పూడిక తీసి పని అయిపోయిందని గుత్తేదారులు ప్రకటిస్తున్నారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేయకుండానే క్షేత్రస్థాయిలోని ఇంజినీర్లు తలాడిస్తున్నారు. ఫలితంగా చిన్నపాటి వర్షం పడినా... వరద ముందుకు సాగక నాలాల పక్కన ఉన్న కాలనీలు ముంపునకు గురవుతున్నాయి.

negligence-in-drainage-development-in-hyderabad
negligence-in-drainage-development-in-hyderabad

By

Published : Jul 18, 2021, 8:49 AM IST

హైదరాబాద్​లోని చాలా చోట్ల నాలాల అభివృద్ధి పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని చోట్ల సగం పనులు మాత్రమే చేసి పూడికతీత పూర్తయినట్లు గుత్తేదారులు ప్రకటించారు. ఎల్బీనగర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లోని నాలాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వారం రోజుల కిందట ఎల్బీనగర్‌ ప్రాంతంలో అనేక కాలనీలు ముంపునకు గురికావడానికి ప్రధాన కారణం.. నాలాల్లో పూర్తిస్థాయిలో పూడిక తీయకపోవడమే.

ఉప్పల్‌ సాయినగర్‌ దగ్గర నాలాలో సగం మాత్రమే తీసి వదిలేశారు. బేగంపేట రసూల్‌పుర వద్ద పాట్నీ కాలనీ దగ్గర సగం పనులే చేశారు. తీసిన మట్టిని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. కూకట్‌పల్లి, మూసాపేట సర్కిల్‌లో రూ.4 కోట్లతో పనులు చేపట్టారు. ఇక్కడ సగం పనులు కూడా జరగలేదని స్థానికులు చెబుతున్నారు. చార్మినార్‌, బహదూర్‌పుర తదితర ప్రాంతాల్లో నాలాల్లో పూడికతీత పూర్తిగా జరగలేదు. నిధులు మాత్రం విడుదల చేశారు. ఈ పనుల పర్యవేక్షణకు ఆయా జోన్ల కమిషనర్ల పర్యవేక్షణలో ఆరుగురు ఎస్‌ఈలు పర్యవేక్షించారు. దీనికోసం ప్రత్యేకంగా యాప్‌ను కూడా రూపొందించారు. ఇంత చేసినా అక్రమాలను కొంతమంది గుత్తేదారులు నిర్భయంగా చేపట్టారు.

  • గతమూడేళ్లలో రూ.140 కోట్లతో పనులు చేశారు. ప్రతి ఏడాది వంద శాతం జరిగితే నగరంలో వరద ప్రవహించే ఏ నాలాలోనూ పూడిక ఉండకూడదు. కానీ ఎక్కడ చూసినా వరద ప్రవహించని పరిస్థితి. దీన్నిబట్టి చూస్తే ఏ ఏడాది కూడా పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదని అర్థం చేసుకోవచ్ఛు

ఈ ఏడాది పూడిక తీత లక్ష్యం: 884.15 కి.మీ

బల్దియా పరిధిలో నాలాలు, వరద కాలువలు: 1368

తొలగించాల్సిన పూడిక: 4.4 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఖర్చు అంచనా: రూ.45 కోట్లు

ఏడాదంతా తీయాలన్నా..

బి.జనార్దన్​రెడ్డి బల్దియా కమిషనర్‌గా ఉన్న సమయంలో... ఏడాదంతా నాలాల్లో పూడిక తీయాలన్న నిబంధనను విధించారు. తర్వాత వచ్చిన కమిషనర్లు ఈ నిబంధనను అమలులోకి తేలేదు. దీంతో గుత్తేదారుల పంటపడింది. వర్షాకాలానికి మూడు నెలల ముందు పనులు మొదలుపెడుతున్నారు. ఈ లోపులో భారీ వర్షాలు వచ్చి నాలాలన్నీ నిండిపోతున్నాయి. ఈ ఏడాది అలానే చేసి లక్ష్యంగా పెట్టుకున్న దాంట్లో 663.11 కిలో మీటర్ల మేర కూలీలు, 221 కిలో మీటర్ల మేర యంత్రాలతో పూర్తి చేసినట్లు నివేదిక ఇచ్చారు.

చర్యలు తీసుకుంటాం!

నగరంలో జరిగిన పూడికతీతపై పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తామని బల్దియా ఉన్నతాధికారి తెలిపారు. ఎక్కడైనా పనులు చేయకుండానే నిధులు మంజూరు చేసి ఉంటే సంబంధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


ఇదీ చూడండి: తెలంగాణలో నేటి నుంచి థియేటర్లు ఓపెన్

ABOUT THE AUTHOR

...view details