రాష్ట్రవ్యాప్తంగా నీట్(NEET) పరీక్ష(exam) ప్రశాంతంగా నిర్వహించారు. నీట్ పరీక్ష(neet exam) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నీట్ రాత పరీక్షకు పెన్నులను నిర్వాహకులే ఇచ్చారు. బయటి నుంచి తీసుకువచ్చినవి అనుమతించలేదు. ఒకటిన్నర తర్వాత వచ్చిన వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ఎన్టీఏ నిబంధనలను కచ్చితంగా అమలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే అర్హత పరీక్ష రాసే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష కేంద్రానికి చేరుకోవటంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
పరీక్షా కేంద్రాల శానిటైజేషన్
కరోనా పరిస్థితుల మధ్య పరీక్షలు నిర్వహించటంతో ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను పూర్తిగా శానిటైజేషన్ చేశామని, పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, తాగునీటితో పాటు గోడ గడియారం కూడా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. సమయం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక కొవిడ్ సోకిన అభ్యర్థులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ప్రతి అభ్యర్థికి థర్మల్ స్క్రీన్‌తో పరీక్షించి.. ముఖానికి మాస్కులు ధరించి, చేతులకు శానిటైజర్ రాసుకున్న తర్వాతనే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.
పరీక్షా పేపర్ కాస్త టఫ్‌గానే వచ్చింది
పొడుగు చొక్కాలు ధరించిన అభ్యర్థులు, ఆభరణాలను ధరించిన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవటంతో పరీక్షా కేంద్రాల వద్ద కొంత అయోమయం నెలకొంది. అలా వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించబోమని నిర్వాహకులు ఖరాఖండిగా చెప్పటంతో కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక పరీక్షా పేపర్ కాస్త టఫ్‌గానే వచ్చిందని అభ్యర్థులు తెలిపారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు.