National Wide Quiz Contest on Statistics: ప్రపంచంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఆధునిక అంతర్జాల యుగంలో డేటా విశిష్టత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని జాతీయ గణాంకాల ప్రాంతీయ కార్యాలయం ఎన్‌ఎస్‌ఓ డైరెక్టర్ జనరల్ డి.సతీష్ అన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్యానంతరం దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న మహానీయులను స్మరించుకుంటూ 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు-ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జాతీయ గణాంక, పథకాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో "అన్వేష - 2022" పేరిట నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
విద్యార్థులను ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండడానికి ఈ తరహా పోటీలు ఇతోధికంగా దోహదపడాలని ఎన్‌ఎస్‌ఓ డైరెక్టర్ జనరల్ డి.సతీష్ సూచించారు. దేశంలో బాలికల అభ్యున్నతి కోసం బేటి బచావో- బేటి పడావో సహా డేటా, గణాంక శాఖ ప్రాముఖ్యత గణాంకాలు, బిగ్ డేటా, డేటా అనాలిసిస్‌లో ప్రపంచ అభివృద్ధికి దోహదపడతాయని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ తరహా విజ్ఞాన పరీక్షలు పోటీతత్వం పెంపొందించుకోవడానికి తోడ్పడతాయన్నారు. అలాగే ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.