గోదావరి-కావేరి అనుసంధానాన్ని(Godavari-Kaveri Rivers Connection) ఇచ్చంపల్లి నుంచి కాకుండా తుపాకులగూడెం బ్యారేజి నుంచే చేపట్టే అంశాన్ని పరిశీలించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ(National Water Development Corporation)) ప్రతిపాదించింది. తెలంగాణ వ్యక్తంచేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచన చేసింది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మిస్తే గోదావరి ఎత్తిపోతల, శ్రీరామసాగర్ ప్రాజెక్టుపైన ఏ మేరకు ప్రభావం ఉంటుందో అధ్యయనం చేయాలని తెలంగాణ కోరింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలు కూడా పలు మార్పులు సూచించాయి.
గోదావరి-కావేరి అనుసంధానం ద్వారా 247 టీఎంసీల నీటిని మళ్లించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సాగు, తాగునీటిని అందించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ(National Water Development Corporation) ఈ పథకాన్ని ప్రతిపాదించింది. గోదావరిలో ఎక్కడి నుంచి నీటిని మళ్లించాలనే దానిపై పలు పరిశీలనల తర్వాత తెలంగాణ సూచన మేరకు ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేసేలా గత ఏప్రిల్‌లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేసింది. దీనిని రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలను కోరింది. ఈ అభిప్రాయాలను క్రోడీకరించి తాజాగా మళ్లీ రాష్ట్రాలకు పంపింది.
గోదావరి, కృష్ణా బేసిన్‌లోని పది రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపాయి. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర సరేననగా, అనుసంధానంలో కీలకమైన రాష్ట్రాలు మాత్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కొత్త సూచనలు చేశాయి. నీటి లభ్యతను ఖరారు చేసే ముందు తమ ఆమోదం కూడా తీసుకోవాలని, ప్రవాహ మార్గాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని పోవడం ద్వారా భూసేకరణ సులభమవుతుందని తెలంగాణ తెలిపింది. మళ్లించే నీటిలో కనీసం యాభై శాతం తమకు ఇవ్వాలని కోరింది. ఇంద్రావతిలో తమకున్న వాటా నుంచి ఈ పథకానికి నీటిని మళ్లించడానికి వీల్లేదని ఛత్తీస్‌గఢ్ స్పష్టం చేసింది. ఇచ్చంపల్లి వద్ద ప్రతిపాదించిన పూర్తి స్థాయి నీటిమట్టం వల్ల తమ రాష్ట్రంలోని నాలుగు గ్రామాలకు చెందిన 171 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని తెలిపింది.
ప్రతిపాదిత పథకాలను డీపీఆర్‌లో పేర్కొనాలి: ఏపీ
ఇప్పటికే ఉన్న, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత పథకాలను కూడా డీపీఆర్‌లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. గోదావరి నుంచి బనకచెర్లకు మళ్లించాలని ప్రతిపాదించిన 200 టీఎంసీలను, గోదావరి-పెన్నా అనుసంధానంతో ప్రతిపాదించిన 320 టీఎంసీలను కూడా డీపీఆర్‌లో చేర్చాలని పేర్కొంది. తమిళనాడులో మళ్లించే నీటిలో కూడా మార్పులు చేయాలని ప్రతిపాదించింది. ఈ అనుసంధానం ద్వారా మళ్లించే నీటిని బేసిన్లవారీగా కేటాయించాలి తప్ప రాష్ట్రాలవారీగా కాదని కర్ణాటక కోరింది. రాష్ట్రాలకు కేటాయింపులు చేయాలన్న ప్రతిపాదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆలమట్టి-పెన్నార్ అనుసంధానాన్ని పక్కనపెట్టాలని సూచింది. అనుసంధానం కావేరి ఆనకట్టపై ఉన్న గ్రాండ్ ఆనకట్టకు కాకుండా కట్టలై బ్యారేజికి అనుసంధానం చేయాలని తెలంగాణ కోరింది. పూండి రిజర్వాయర్‌ను అరణియార్‌తో అనుసంధానం చేస్తే మరో 15 టీఎంసీలను వినియోగించుకొని 609 చెరువులను నింపవచ్చని, గ్రాండ్ ఆనకట్టకు మళ్లించే 46 టీఎంసీలను కావేరి ఆయకట్టుతో సంబంధం లేదని స్పష్టం చేయాలని, లేదంటే కొత్త వివాదాలు తలెత్తుతాయంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తమిళనాడుకు 83 టీఎంసీలు కాకుండా 200 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. కేరళ, పాండిచ్చేరి కూడా ఈ నీటిలో వాటా కోరాయి.