ఎన్95 మాస్కుల ధరలకు కళ్లెం పడింది. కరోనా నేపథ్యంలో అనూహ్యంగా పెరిగిన వీటి ధరల్లో సుమారు 20 నుంచి గరిష్ఠంగా 40 శాతం వరకూ తగ్గిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్‌పీపీఏ) నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి సంస్థను బట్టి ఖరీదును రూ.96 నుంచి రూ.165 వరకూ విక్రయించేలా స్థిరీకరించింది. ఈ మేరకు ఎన్‌పీపీఏ తాజాగా ఆదేశాలు జారీచేసింది.
గుడ్ న్యూస్: తగ్గనున్న ఎన్95 మాస్కుల ధర - National Pharmaceutical Pricing Authority
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో ఒక్కసారిగా మాస్కుల వినియోగం పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల మాస్కుల ధరలకు రెక్కలొచ్చాయి. వీటిలో అత్యధికంగా ఎన్95 మాస్కుల ధర అనూహ్యంగా పెరిగింది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్95 మాస్కుల ధరను గరిష్ఠంగా 20 నుంచి 40 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
పెరిగిన గిరాకీతో..
దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభణతో ఎన్95 మాస్కులకు డిమాండ్ పెరిగింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఈ మాస్కులు సమర్థంగా ఉపయోగపడతాయని నిపుణులు సూచించడంతో వాటి ప్రాధాన్యం సామాన్యులకూ తెలిసింది. ముఖ్యంగా ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ సేవల్లో ఈ మాస్కుల వినియోగం తప్పనిసరైంది. ఫలితంగా ఉత్పత్తి సంస్థలు వీటి ధరలను పెంచేశాయి. ఒక్కో మాస్కును రూ.400 కూడా విక్రయించి కొందరు దుకాణదారులు సొమ్ము చేసుకున్నారు. సాధారణ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్‌పీపీఏ నూతన ధరలను స్థిరీకరిస్తూ ఆదేశాలు జారీచేసింది.
- ఇదీ చూడండి :'ఆందోళన వద్దు, ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలి'