హాయ్.. నా పేరు సోనీ ఖటూన్. మాది జార్ఖండ్ ధన్‌బాద్ జిల్లాలోని జోదాపోఖర్ గ్రామం. నాకు చిన్నతనం నుంచి ఆటలంటే చాలా ఇష్టం. అందులోనూ విలువిద్యలో ఆరితేరాలని కలలు కనేదాన్ని. అయితే అందుకు మా కుటుంబ ఆర్థిక స్థితిగతులు సహకరించలేదు. పూట గడవడమే కష్టంగా ఉన్న నా పరిస్థితి తెలిసినప్పటికీ నేను ఆటపై మక్కువ వీడలేదంటే నిజంగా అది నా ధైర్యమేనేమో! నా సంకల్పానికి నేను చదివే పాఠశాల ఉపాధ్యాయులు కూడా తోడయ్యారు. వారు అన్ని విధాలా నన్ను ప్రోత్సహించారు.
మరో ఎదురుదెబ్బ!
విలువిద్యలో క్రమంగా పట్టు సాధిస్తూ.. పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు కూడా సాధించింది సోనీ ఖటూన్ . ఈ క్రమంలోనే జాతీయ ఆర్చరీ పోటీల్లో పతకం నెగ్గి... 2011 నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్-17 విభాగంలో కాంస్య పతకంను కైవసం చేసుకుంది.
ఆ తర్వాత తమ కుటుంబ పరిస్థితి మరింత దిగజారడం వల్ల తన చదువును కూడా మధ్యలోనే ఆపేసినట్లు సోని ఖటూన్ తెలిపారు. ఇంట్లో ఉంటూనే ఆర్చరీలో ఆరితేరాలన్న తన కలకు మరో ఎదురుదెబ్బ తగిలిందని ఆమె వాపోయింది. ప్రాక్టీస్ చేసే తన విల్లు కూడా విరిగిపోయింది... మరోటి కొందామంటే అంత డబ్బు తన దగ్గర లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అలా ఆర్చరీ ప్రాక్టీస్‌కు బ్రేక్ పడిందని చెప్పుకొచ్చారు.
అందుకే కూరగాయలమ్ముతుంది...
ప్రస్తుతం అమ్మానాన్నల బాధ్యత తన పైనే ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ లాక్‌డౌన్ కారణంగా కూలీ పనులు కూడా లేకపోవడం వల్ల తమ కుటుంబ పరిస్థితి మరింతగా దిగజారిందన్నారు. అందుకే ప్రస్తుతం కడుపు నింపుకోవడానికి ఝార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లాలోని పలు వీధుల్లో తిరుగుతూ కూరగాయలమ్ముతున్నానని చెప్పారు. ప్రొఫెషనల్ ఆర్చర్‌ను కావాలని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నది తన కల అని పేర్కొన్నారు.
ఆమె దుస్థితి చూడలేక..!
ఇలా తనలో ట్యాలెంట్ ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు సహకరించక కూటి కోసం కూరగాయలమ్ముతూ, తాను ఇప్పటివరకు సాధించిన పతకాలను చూపుతూ.. తీసిన సోనీ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. అది కాస్తా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కంట పడింది. అది చూసి చలించిపోయిన ఆయన.. అదే వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘విల్లు పట్టిన చేతులే కుటుంబ పోషణ కోసం కూరగాయలమ్ముతుంటే చూడలేకపోతున్నాం..
తనలో ట్యాలెంట్ ఉండి కూడా సోనీ తన కుటుంబానికి అండగా ఉండడానికి కూరగాయలమ్ముతోంది. తమ ప్రభుత్వం ఆమెకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది. ఆమెకే కాదు.. ఇంకా ఇలాంటి ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీసి వారిని ప్రోత్సహించడానికి, వారికి అన్ని అవకాశాలు అందించడానికి మేము సిద్ధం..’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారాయన. అంతేకాదు.. సోనీ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ. 20 వేల చెక్కును కూడా పంపించారు సీఎం.
సోనీ కూరగాయలమ్ముతోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సోనీ తాను అనుకున్నట్లుగానే భవిష్యత్తులో మేటి ఆర్చర్‌గా పేరు తెచ్చుకోవాలని.. తన కలను సాకారం చేసుకోవాల’ని కోరుతూ నెటిజన్లు ఆమెను ఆశీర్వదిస్తున్నారు.