- హైదరాబాద్ - వరంగల్ ప్రయాణికుల కోసం కరుణాపురం వద్ద జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డును నిర్మించారు. ఒక మార్గం వరంగల్ నగరంలోకి,మరోమార్గం ములుగు వైపు వెళ్తాయి. ఈ రెండు మార్గాలు కలిసేచోట జంక్షన్ నిర్మించలేదు. దీంతో సర్వీస్ రోడ్డు ద్వారా వరంగల్ నగరంలోకి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ మార్గంలో పలు మలుపులను దాటి అండర్‌పాస్ ద్వారా నగరంలోకి వెళ్లాల్సి వస్తోంది.
Telangana Roads : తెలంగాణలో.. ఒకవైపు జాతీయ రహదారుల విస్తరణకు ప్రణాళికలు రూపొందుతుండగా మరోవైపు రాష్ట్రంలో రహదారులను నిర్మించే ఆర్ అండ్ బి మరికొన్ని రోడ్ల నిర్మాణం చేపడుతోంది. ఈ రెండుశాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల.. జంక్షన్లు నిర్మించకపోవడం వల్ల చాలాచోట్ల బైపాస్ రోడ్లు సమస్యాత్మకంగా మారుతున్నాయి. లేదంటే వాటివల్ల ఆశించినంత ప్రయోజనం కలగడంలేదు. ఒకటీ రెండు చోట్ల కాదు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కు ముడులను విప్పేందుకు నిర్మిస్తున్న బైపాస్‌లు, అవుటర్ రింగు రోడ్లు ప్రజలకు పరీక్ష పెడుతున్నాయి. రాష్ట్ర, జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా పెద్ద సంఖ్యలో వీటిని నిర్మిస్తున్నారు. కానీ వీటి నిర్మాణం విషయంలో ముందుచూపు కొరవడుతోంది. ఆయా మార్గాల నిర్మాణంలో భవిష్యత్తు వ్యూహాలను, సాంకేతిక అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయడం లేదు. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. జాతీయ రహదారుల సంస్థ, రహదారులు-భవనాల శాఖ, ఆయా మార్గాలు నిర్మించే ప్రాంతంలోని స్థానిక సంస్థల అధికారుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఆ మార్గం నిర్మాణం చేపట్టే సమయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎవరికి వారుగా నిర్మాణాలు చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయి.
Telangana High Ways : కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారి. దీన్ని ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ అంశాన్ని పట్టించుకోకుండా అదే రహదారిపై వరంగల్ సమీపంలోని బీమారం వద్ద ఇటీవల బైపాస్ నిర్మించారు. దీంతో భవిష్యత్తు విస్తరణకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.